విజయవాడలో సంచలనం రేపిన కల్యాణి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొంటున్న షఫీ అబ్దుల్లాను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల దర్యాప్తు ప్రకారం.. తన కుమారుడిని తనకు ఇవ్వమని అడిగినందుకే కల్యాణిని ఇంటికి పిలిపించి హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా చేసి కాలువలో పడేసినట్లు పోలీసులు తెలిపారు.
కాగా, మంగళగిరికి చెందిన 29 ఏళ్ల కల్యాణి తన కొడుకుతో పాటు కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంది. ఆ క్రమంలోనే షఫీ అబ్దుల్లాతో ఆమెకు పరిచయం అయింది. కొడుకులు లేని అబ్దుల్లా కల్యాణి కొడుకుని తన కుమార్తెలతో పాటు చూసుకునేవాడు. తన కొడుకును తనకు ఇవ్వమని కల్యాణి తరచూ అతనితో వాగ్వాదానికి దిగేదని పోలీసులు వెల్లడించారు. ఆ క్రమంలోనే అబ్దుల్లా ఆమెను తన ఇంటికి పిలిపించి హత్య చేసినట్లు నిర్ధారించారు. ఆమె అదృశ్యమైన తర్వాత విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఉన్న కూలింగ్ కాలువలో మహిళ మృతదేహానికి సంబంధించిన శరీర భాగాలు కనిపించడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తొలుత మృతదేహం ఎవరిదన్నది తెలియకపోయినా.. చేతిపై ఉన్న టాటూ, ఇతర ఆధారాలు, సాంకేతిక సమాచారంతో ఆమెను కల్యాణిగా గుర్తించారు.
పోలీసుల దర్యాప్తులో షఫీ అబ్దుల్లాతో కల్యాణికి పరిచయం ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే ఆమెను భవానీపురంలోని తన ఇంటికి పిలిపించినట్లు పోలీసులు తెలిపారు. అక్కడ ఇద్దరి మధ్య వివాదం చోటుచేసుకున్న అనంతరం కల్యాణిని హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందని వెల్లడించారు. హత్యకు సంబంధించిన కారణాలపై విచారణలో పలు అంశాలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
హత్య అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా చేసి, వాటిని తరలించి విజయవాడలోని కూలింగ్ కాలువలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి షఫీ అబ్దుల్లాను అదుపులోకి తీసుకుని విచారించగా కీలక వివరాలు బయటకు వచ్చినట్లు తెలిపారు. కేసులో మరికొందరి పాత్రపైనా దర్యాప్తు కొనసాగుతున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.
మరోవైపు, కూలింగ్ కాలువలో శరీర భాగాలు గుర్తించిన సమయంలో పోలీసులు ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. లభించిన శరీర భాగాలను పోస్టుమార్టం కోసం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల సహకారం, సాంకేతిక ఆధారాల ఆధారంగా పోలీసులు కేసును ముందుకు తీసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు.
కల్యాణి హత్యకు దారితీసిన పూర్తి కారణాలు, నిందితుడి పాత్ర, మృతదేహాన్ని తరలించడంలో మరెవరైనా సహకరించారా అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. షఫీ అబ్దుల్లాను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
also read: వాట్సాప్‌లో డీల్స్.. ఇంట్లో దందా…! గుంటూరులో పోలీసుల దాడితో బయటపడిన గుట్టు..
