జగిత్యాల జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఓ ప్రభుత్వ అధికారిణిని లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అంగన్వాడీ కేంద్రాలపై తనిఖీల సందర్భంగా ప్రతికూల నివేదికలు ఇవ్వకుండా ఉండేందుకు నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు.
మెట్పల్లి చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (సీడీపీవో)గా దారోజు పద్మ పనిచేస్తున్నారు. ఆమె పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తుంటారు. అయితే తనిఖీల్లో తమకు వ్యతిరేకంగా నివేదికలు రాకుండా చూసేందుకు అంగన్వాడీ సూపర్వైజర్ల నుంచి నెలవారీగా డబ్బులు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేసినట్లు ఏసీబీకి ఫిర్యాదు అందింది.
ఆమె పరిధిలో ఉన్న 21 మంది అంగన్వాడీ సూపర్వైజర్లు ఒక్కొక్కరు నెలకు రూ.1,000 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. మూడు నెలలకు సంబంధించిన మొత్తాన్ని ఒకేసారి తీసుకునేందుకు పద్మ అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో 21 మంది సూపర్వైజర్ల నుంచి మొత్తం రూ.63,000 తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో దాడి చేశారు.
లంచం తీసుకుంటున్న సమయంలో సీడీపీవో పద్మను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టారు. అంగన్వాడీ సూపర్వైజర్ల నుంచి నెలవారీగా మామూళ్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలతో ప్రభుత్వ అధికారిణి ఏసీబీకి పట్టుబడటం జగిత్యాల జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
also read: సూరారంలో షాకింగ్ ఘటన.. టీచర్‌ను వేధించిన ప్రిన్సిపాల్.. నిలదీసినందుకు కత్తితో దాడి
