Homeక్రైమ్నకిలీ పోలీస్ దారుణం.. దివ్యాంగ యువకుడిని రైలు నుంచి తోసేసి హత్య

నకిలీ పోలీస్ దారుణం.. దివ్యాంగ యువకుడిని రైలు నుంచి తోసేసి హత్య

క్రైమ్ మిర్రర్ : బీహార్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. రైలులో సిగరెట్ తాగిన ఓ దివ్యాంగ యువకుడిని పోలీస్ అధికారినని నమ్మించిన ఓ వ్యక్తి బెదిరించి డబ్బులు డిమాండ్ చేశాడు. చివరకు డబ్బు ఇవ్వలేదన్న కారణంతో కదులుతున్న రైలు నుంచి యువకుడిని కిందకు తోసేయడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. కేసును దర్యాప్తు చేసిన రైల్వే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. వైశాలి జిల్లాకు చెందిన 21 ఏళ్ల నితిన్ కుమార్ హైదరాబాద్‌లో కూలీగా పనిచేస్తున్నాడు. సెప్టెంబర్ 19న హైదరాబాద్ నుంచి దానాపూర్ వెళ్తున్న ప్రత్యేక రైలులో స్వగ్రామానికి బయలుదేరాడు. దివ్యాంగుడైన నితిన్ ప్రత్యేకంగా కేటాయించిన కోచ్‌లో ప్రయాణిస్తున్నాడు.

సెప్టెంబర్ 20న రాత్రి నితిన్ రైలులో సిగరెట్ తాగుతున్న సమయంలో ఓ వ్యక్తి అతడిని గమనించాడు. ఆ వ్యక్తి తాను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) అధికారి, టికెట్ తనిఖీ సిబ్బందికి చెందిన వ్యక్తినంటూ నితిన్‌ను భయపెట్టాడు. సిగరెట్ తాగినందుకు రూ.20 వేల జరిమానా విధిస్తున్నట్లు చెప్పాడు. బక్సర్ రైల్వే స్టేషన్ వద్ద నితిన్‌ను రైలు నుంచి బలవంతంగా దింపినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అతడి ఫోన్‌ ద్వారా కుటుంబ సభ్యులకు కాల్ చేయించి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తొలుత రూ.10 వేలు అడగగా, మరుసటి రోజు పంపిస్తామని కుటుంబ సభ్యులు చెప్పారు. ఆ మేరకు రూ.5 వేలను నితిన్ ఫోన్‌కు పంపించారు.

అయితే సెప్టెంబర్ 21న ఉదయం మళ్లీ నితిన్ మొబైల్ నుంచి కుటుంబ సభ్యులకు ఫోన్ వచ్చింది. ఈసారి రూ.20 వేలు ఇవ్వాలని నిందితుడు డిమాండ్ చేశాడు. రోజంతా పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ కుటుంబ సభ్యులకు నితిన్‌తో నేరుగా మాట్లాడే అవకాశం రాలేదు. దీంతో వారికి అనుమానం వచ్చింది. నితిన్ కుటుంబ సభ్యులు గ్రామ పెద్దతో కలిసి బక్సర్ రైల్వే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు దర్యాప్తును ప్రారంభించారు.

దానాపూర్ రైల్వే డీఎస్పీ కాంచన్ రాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. సాంకేతిక ఆధారాలు, ఇతర సమాచారాన్ని విశ్లేషించిన పోలీసులు నిందితుడి ఆచూకీని గుర్తించారు. మోహన్‌సరాయ్ ప్రాంతంలో రోహిత్ తివారీని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో డబ్బులు ఇవ్వకపోవడంతో నితిన్‌ను కదులుతున్న రైలు నుంచి కిందకు తోసేసినట్లు నిందితుడు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆరా-జగ్జీవన్ హాల్ట్ మధ్య రైల్వే ట్రాక్ సమీపంలో పోలీసులు మృతదేహాన్ని గుర్తించారు.

మృతదేహాన్ని నితిన్ కుమార్‌దిగా అతడి తండ్రి గుర్తించినట్లు అధికారులు తెలిపారు. నిందితుడు రోహిత్ తివారీపై గతంలోనూ పలు కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. సుమారు 25 నెలలు జైలులో ఉన్న అతడు రెండు నెలల క్రితమే బెయిల్‌పై బయటకు వచ్చాడని, అనంతరం మరోసారి నేరాలకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
also read : బృందావన్ ఆశ్రమంలో విషాదం.. నాలుగో అంతస్తు నుంచి పడి శిష్యుడు మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు