-
కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా కామెంట్స్
-
ఎలక్షన్ కమిషనర్ల వివాదంలో వ్యాఖ్యలు
-
ఇండియా కూటమికి దగ్గరగా సంకేతం
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా యూటర్న్ తీసుకుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి వ్యతిరేకంగా పావులు కదుపుతోంది. బిజెపి నుంచి మునుపటి సహకారం లభించకపోగా.. పాత కేసులు తెరపైకి వస్తుండడంతో జగన్ పునరాలోచనలో పడ్డారు. ఇలానే ఉంటే ఎటు కాకుండా పోతామని చెప్పి జాతీయస్థాయిలో తన రాజకీయ వైఖరిని మార్చుకునే పనిలో పడ్డారు. కాంగ్రెస్ ను విభేదించి ఏ దూకుడు ప్రదర్శించారో.. ఇప్పుడు అదే దూకుడు పెంచాలని చూస్తున్నారు. బిజెపితో తెరవెనుక స్నేహాన్ని కూడా విడిచి పెట్టాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల జరుగుతున్న పరిణామాలు కూడా ఈ విషయాలను స్పష్టం చేస్తున్నాయి. వామపక్షాలతో స్నేహం ఒకవైపు.. ఎన్నికల కమిషన్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా జగన్ గళం ఎత్తడం ఈ అనుమానాలను బలం చేకూరుస్తోంది.
దక్షిణాది నుంచి జగన్…
ఎలక్షన్ కమిషన్ కు సంబంధించి దేశవ్యాప్తంగా వివాదం నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు గట్టిగానే తమ వాయిస్ వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అయితే ఓ రేంజ్ లో ఉద్యమం చేసినంత పని చేస్తోంది. అయితే దక్షిణాది రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ తప్ప ఏ పార్టీ ఇంతవరకు స్పందించలేదు. సరిగ్గా ఇటువంటి సమయంలో జగన్ స్పందించారు. రాజ్యాంగబద్ధవ్యవస్థలపై ప్రజలకు నమ్మకం ఉన్న నాడే.. ప్రజాస్వామ్యం నిలబడుతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేశారు జగన్. తద్వారా కేంద్ర ప్రభుత్వ వైఖరి తప్పు అన్నట్టు సంకేతాలు పంపించారు. దక్షిణ భారతదేశంలో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులతో పాటు ఆ పార్టీ నేతలు ఎలక్షన్ కమిషనర్ల విషయంలో కేంద్ర వైఖరిని తప్పుపడుతున్నారు. ఇతర ప్రాంతీయ పార్టీ నేతలు ఎవరు ఇంతవరకు తప్పు పట్టిన దాఖలాలు లేవు. కానీ జగన్ ఏకంగా కేంద్రం పై తిరుగుబాటు చేసినంత మాదిరిగా వ్యాఖ్యానాలు చేయడం విశేషం.
వామపక్షాలతో దోస్తీ…
వాస్తవానికి సిద్ధాంత పరంగా బిజెపిని దారుణంగా వ్యతిరేకిస్తాయి వామపక్షాలు. అటువంటి వామపక్షాలతో స్నేహం కోసం జగన్మోహన్ రెడ్డి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏకంగా జగన్ నివాసానికి సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ వెళ్లి చర్చలు జరిపారు. కేవలం జగన్మోహన్ రెడ్డిని ఇండియా కూటమిలోకి ఆహ్వానించేందుకు ఒక దూతగా రామకృష్ణ వెళ్లినట్లు ప్రచారం నడుస్తోంది. అయితే జగన్ ఈ నిర్ణయానికి రావడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. మునుపటి సహకారం బిజెపి నుంచి లభించడం లేదు. ఆపై వివేకానంద రెడ్డి హత్య కేసులో ఈడి ఎంట్రీ ఇచ్చి షాక్ ఇచ్చింది. తనపై ఉన్న పాత కేసులు కూడా మళ్లీ తెరపైకి వచ్చి బెయిల్ రద్దయ్యే అవకాశం ఉంది. మరోవైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కు కేంద్ర పెద్దల నుంచి మంచి సహకారం అందుతోంది. నేరుగా బిజెపితో కలిసే చాన్స్ లేదు. పోనీ పరోక్ష సహకారం అందుతుందంటే అది కనిపించడం లేదు. అందుకే బిజెపికి దూరంగా జరిగి.. అవసరం అనుకుంటే తిరుగుబాటు చేయడం ఉత్తమమైన నిర్ణయానికి జగన్ వచ్చినట్లు స్పష్టం అవుతుంది.
ఇవి కూడ చదవండి
-
నకిలీ బాబా దారుణం.. జాతక దోషం పేరుతో బాలికపై అత్యాచారం
-
రైళ్లలో చాక్లెట్ల రూపంలో గంజాయి అక్రమ రవాణా.. తుని రైల్వే పోలీసుల తనిఖీల్లో భారీగా పట్టివేత
-
వినాయక నిమజ్జనంలో భర్త మరో యువతితో డ్యాన్స్… మనస్తాపంతో భార్య ఆత్మహత్య
-
సెప్టెంబర్ 30న సీఎం రేవంత్రెడ్డి భారీ బహిరంగ సభ…!
