Homeక్రైమ్బెంగళూరులో దారుణ హత్య.. పాత పరుపులో బయటపడిన మహిళ మృతదేహం

బెంగళూరులో దారుణ హత్య.. పాత పరుపులో బయటపడిన మహిళ మృతదేహం

బెంగళూరులో దారుణ హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఖాళీ స్థలంలో పడివున్న పాత పరుపును తొలగించేందుకు ప్రయత్నించిన కార్మికులకు అందులో నుంచి మనిషి కాలు కనిపించడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెనుక ఉన్న విషయం బయటపడింది. మృతురాలు ఒడిశాకు చెందిన 28 ఏళ్ల అనుసూయగా పోలీసులు గుర్తించారు. ఆమెను భర్త సాగర్ చంద్ర రావత్ హత్య చేసినట్లు దర్యాప్తులో తేలడంతో అతడిని అరెస్ట్ చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 2న సంపిగేహళ్లి సమీపంలోని అగ్రహార లేఅవుట్‌లో ఓ ఖాళీ స్థలాన్ని కొందరు కార్మికులు శుభ్రం చేస్తున్నారు. అక్కడ చాలాకాలంగా పడి ఉన్న పాత పరుపు తరహా వస్తువును తొలగించే సమయంలో అందులో నుంచి ఓ కాలు బయటకు కనిపించింది. దీంతో భయపడిన కార్మికులు వెంటనే స్థానికులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించగా.. ఓ మహిళ మృతదేహాన్ని బెడ్‌షీట్‌లో చుట్టి, తాడుతో బిగించి కట్టినట్లు గుర్తించారు. మృతదేహం పరిస్థితిని బట్టి హత్య జరిగి సుమారు 20 రోజులు అయి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు.

అయితే మృతురాలి వివరాలు తెలియకపోవడంతో ఆమెను గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది. ఈ క్రమంలో ఆమె ధరించిన దుస్తులపై ఉన్న ట్యాగ్ కీలక ఆధారంగా మారింది. ఆ ట్యాగ్ ఆధారంగా దుస్తులు కొనుగోలు చేసిన దుకాణాన్ని గుర్తించిన పోలీసులు.. అక్కడి బిల్లు వివరాల ద్వారా మృతురాలు ఒడిశాకు చెందిన అనుసూయ అని నిర్ధారించారు.

ఆ తర్వాత పోలీసులు ఆమె భర్త సాగర్ చంద్ర రావత్‌పై దృష్టి సారించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్యకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

అనుసూయ, సాగర్ ఇద్దరూ ఒడిశాకు చెందినవారు. ప్రేమించుకున్న వీరిద్దరూ సుమారు రెండేళ్ల క్రితం కుటుంబ సభ్యులకు తెలియకుండా వివాహం చేసుకున్నారు. అనంతరం ఉపాధి కోసం బెంగళూరుకు వచ్చి వేర్వేరు హోటళ్లలో ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

ఆగస్టు 11న జీతం, అడ్వాన్స్ డబ్బుల విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లోనూ వాగ్వాదం కొనసాగడంతో ఆగ్రహానికి గురైన సాగర్.. అనుసూయ గొంతు నులిమి హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

హత్య అనంతరం మృతదేహాన్ని వెంటనే బయటకు తరలించకుండా మూడు రోజుల పాటు ఇంట్లోనే ఉంచినట్లు పోలీసులు పేర్కొన్నారు. అనంతరం ఆగస్టు 14 లేదా 16వ తేదీ రాత్రి మృతదేహాన్ని బెడ్‌షీట్‌లో చుట్టి, తాడుతో కట్టి సమీపంలోని ఖాళీ స్థలంలో పడేసినట్లు వెల్లడించారు. ఆ తర్వాత సాగర్ ఇంటిని ఖాళీ చేసి హోటల్‌లోనే ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు.

విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

also read: రావణ్‌పై “ఉపా” కేసు.. ఆర్థిక లావాదేవీలపై పోలీసుల ఫోకస్.. కీలక దశలో దర్యాప్తు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు