ఆన్‌లైన్‌లో ఆహార ఉత్పత్తుల విక్రయాలపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) దృష్టి సారించింది. ప్రముఖ ఈ-కామర్స్, క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో, బిగ్‌బాస్కెట్‌లలో అందుబాటులో ఉన్న కొన్ని ఆహార ఉత్పత్తులపై పరిశీలన చేపట్టింది.
ముఖ్యంగా కొన్ని బ్రాండ్ల ఉత్పత్తులపై చేస్తున్న క్లెయిమ్స్, ప్యాకేజింగ్ లేదా ఆన్‌లైన్ లిస్టింగ్స్‌లో ఇస్తున్న సమాచారం నిబంధనలకు అనుగుణంగా ఉందా అనే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. హ్యాపిలో, మిల్కీ మిస్ట్ వంటి బ్రాండ్లకు సంబంధించిన ఉత్పత్తుల విషయంలోనూ అసత్య లేదా నిబంధనలకు విరుద్ధమైన సమాచారంపై FSSAI దృష్టి పెట్టినట్లు సమాచారం.
ఇదే సమయంలో ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ధతూరా (ఉమ్మత్త) పండ్లు, విత్తనాల విక్రయాలపైనా అధికారులు చర్యలు చేపట్టారు. ధతూరా ఉత్పత్తులు ఆరోగ్యానికి హానికరమైన ప్రభావాలు కలిగించే అవకాశం ఉండటంతో, వాటి విక్రయాలు, ఆన్‌లైన్ లిస్టింగ్స్‌పై నిఘా పెట్టారు.
ఆహార ఉత్పత్తుల విషయంలో వినియోగదారులకు తప్పుదారి పట్టించే సమాచారం అందకుండా చూడటం, నిబంధనలకు విరుద్ధమైన ఉత్పత్తుల విక్రయాలను అరికట్టడం ఈ చర్యల ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం-2006 నిబంధనల ప్రకారం సంబంధిత అంశాలపై చర్యలు కొనసాగుతున్నాయి.
ఆన్‌లైన్‌లో ఆహార పదార్థాలను కొనుగోలు చేసే వినియోగదారులు ఉత్పత్తి వివరాలు, లేబులింగ్, క్లెయిమ్స్, తయారీదారు వివరాలను పరిశీలించి కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
also read: మాదాపూర్ ఓయో హోటల్‌లో యువతి మృతి.. పరారీలో ఉన్న ప్రియుడు ఆత్మహత్యాయత్నం
