క్రైమ్ మిర్రర్ : హైదరాబాద్‌లోని మాదాపూర్ ఓయో హోటల్‌లో విశాఖపట్నానికి చెందిన షారన్ నిఖిత టోప్నో (23) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో పరారీలో ఉన్న ఆమె ప్రియుడు శ్రీనివాస రవితేజ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో దర్యాప్తులో కొత్త మలుపు తిరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ఈదుమెట్ల మర్రిపాలెంలోని తన నివాసంలో రవితేజ ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే అతడిని విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
వెలుగులోకి షాకింగ్ విషయాలు
సిద్ధిఖీ నగర్‌లోని ఓయో హోటల్ రూమ్ నంబర్ 303ని పరిశీలించిన పోలీసులకు దిగ్భ్రాంతికర దృశ్యాలు కనిపించాయి. గదిలోని గోడలు, బెడ్‌షీట్‌పై రక్తపు మరకలతో పాటు పగిలిన బీర్, విస్కీ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిఖిత ముఖం, శరీరం, తల వెనుక భాగంలో తీవ్ర గాయాలు ఉన్నట్లు గుర్తించారు.
హోటల్ సూపర్‌వైజర్ అందించిన సమాచారం ప్రకారం.. అర్ధరాత్రి వేళ నిఖిత స్పృహ తప్పిపడిపోయిందని రవితేజ చెప్పాడు. అంబులెన్స్ పిలుద్దామని సూచించినప్పటికీ వినకుండా బైక్‌పైనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ వైద్యులు ఆమె మృతి చెందినట్లు ధృవీకరించడంతో భయపడి అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా, రవితేజ కంటే నిఖిత మూడేళ్లు పెద్దదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు.
also read : ఇంట్లోనే విషాదం.. విద్యుదాఘాతంతో తల్లీకూతురు మృతి
