Homeజాతీయంపంజాబ్‌లో ఈడీ సోదాలు.. భగ్గుమన్న ఆప్ నిరసనలు

పంజాబ్‌లో ఈడీ సోదాలు.. భగ్గుమన్న ఆప్ నిరసనలు

క్రైమ్ మిర్రర్ : పంజాబ్‌లోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేపట్టిన సోదాలు రాజకీయ ఉద్రిక్తతకు దారితీశాయి. తిరుపతి ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు ఢిల్లీ, మొహాలీ, చండీగఢ్, పంచకులా, లుధియానా ప్రాంతాల్లోని 26 ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా గురువారం గ్రేటర్ మొహాలీ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (జీఎంఏడీఏ) కార్యాలయంలోనూ ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ప్రభుత్వ కార్యాలయంలో కేంద్ర దర్యాప్తు సంస్థ తనిఖీలను ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది.

దీంతో పెద్ద సంఖ్యలో ఆప్ కార్యకర్తలు జీఎంఏడీఏ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కార్యాలయంలోకి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటేందుకు వారు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆప్ కార్యకర్తలు, భద్రతా సిబ్బంది మధ్య తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారిన సమయంలో ఈడీకి చెందిన ఓ వాహనం అద్దం ధ్వంసమైంది.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తోందని ఆప్ ఆరోపించింది. పంజాబ్ ప్రభుత్వం, అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో పాటు జీఎంఏడీఏ కార్యకలాపాలకు ఆటంకం కలిగించడమే ఈడీ సోదాల వెనుక ఉద్దేశమని ఆ పార్టీ నేతలు విమర్శించారు. సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నాలు రాజకీయంగా సాధ్యం కాకపోవడంతో పరిపాలనా స్థాయిలో ఇబ్బందులు సృష్టిస్తున్నారని ఆప్ పేర్కొంది.

ఇదిలా ఉండగా, ఈడీ సోదాలపై పంజాబ్ ప్రభుత్వం న్యాయపరమైన చర్యలు చేపట్టింది. ప్రభుత్వ పరిపాలనా కార్యకలాపాలకు తనిఖీల కారణంగా అంతరాయం కలుగుతోందని పేర్కొంటూ పంజాబ్-హర్యానా హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు, ఈడీ సోదాలు నిర్వహించిన ప్రాంతాలను పరిశీలించి పరిస్థితిపై నివేదిక అందించేందుకు ఓ వారెంట్ అధికారిని నియమించింది. సంబంధిత ప్రాంగణాలను అవసరమైన సమయంలో తనిఖీ చేసే అధికారాన్ని కూడా ఆయనకు కల్పించింది.
also read : రేవంత్ పై నీళ్ల అస్త్రం…! భారీ ప్రణాళికతో గులాబీ పార్టీ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు