-
టిడిపిలో చేరేందుకు సిద్ధపడిన పిరియా విజయలక్ష్మి, సాయి రాజ్ దంపతులు
-
గత కొంతకాలంగా వైసిపి నాయకత్వం పై అసంతృప్తి
క్రైమ్ మిర్రర్, ఉత్తరాంధ్ర: ఉత్తరాంధ్ర నుంచి వైసీపీకి మరో నేత గుడ్ బై చెబుతారా? తెలుగుదేశం పార్టీలో చేరుతారా? ఈ మేరకు చర్చలు పూర్తయ్యాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. మొన్ననే విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ చిన్న శ్రీను వైసీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. తన కుమార్తెతో కలిసి టిడిపిలో చేరిన సంగతి విధితమే. ఆయన పార్టీకి గుడ్ బై చెప్పడంతో వైసీపీలో ప్రకంపనలు రేగాయి. అయితే తాజాగా శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయలక్ష్మి టిడిపిలో చేరుతారన్న ప్రచారం పెద్ద ఎత్తున ప్రారంభం అయింది. గత కొంతకాలంగా వైసీపీ పై ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.
నియోజకవర్గ బాధ్యతలు తప్పించి…
గత స్థానిక సంస్థల ఎన్నికల్లో పిరియా విజయలక్ష్మి కి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి వరించింది. ఆమె భర్త సాయిరాజ్ 2009లో తెలుగుదేశం పార్టీ తరఫున ఇచ్చాపురం శాసనసభ నియోజకవర్గం నుంచి గెలిచారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఆ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో టిడిపి ఓడిపోయింది. ఒక్క ఇచ్చాపురం స్థానం నుంచి సాయిరాజ్ రూపంలో టిడిపి గెలిచింది. అయితే కొద్ది రోజులకే సాయిరాజ్ వైయస్సార్ కాంగ్రెస్ గూటికి చేరారు. రెండుసార్లు ఆయన పోటీ చేశారు కానీ ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో మాత్రం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా ఉన్న విజయలక్ష్మి ఇచ్చాపురం అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయినా ఓటమి ఎదురైంది. అయితే గత రెండు సంవత్సరాలుగా ఇచ్చాపురం వైసిపి నియోజకవర్గ సమన్వయకర్తగా కొనసాగుతూ వచ్చారు. కానీ ఇటీవల జగన్మోహన్ రెడ్డి అక్కడ నాయకత్వాన్ని మార్చారు. సాడిశ్యాం ప్రసాద్ రెడ్డి అనే కొత్త నేతకు బాధ్యతలు కట్టబెట్టారు. అప్పటినుంచి పిరియా విజయలక్ష్మి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం నడిచింది.
ఇద్దరు ఎమ్మెల్యేలు హాజరు…
జడ్పీ పాలకవర్గాలు ముగిసిన నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆత్మీయ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టిడిపి ఎమ్మెల్యేలు కూన రవికుమార్, మామిడి గోవిందరావు హాజరయ్యారు. ఇటీవల కాలంలో జిల్లా పరిషత్ సమావేశంలో దూకుడుగా ఉండేవారు ఆమదాలవలస టిడిపి ఎమ్మెల్యే రవికుమార్. అటువంటి సమయంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తీరుపై కూడా విరుచుకుపడిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఉన్నట్టుండి అదే జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సన్మాన కార్యక్రమానికి టిడిపి ఎమ్మెల్యేలు హాజరుకావడం హాట్ టాపిక్ అవుతోంది. పిరియా విజయలక్ష్మి, ఆమె భర్త సాయిరాజ్ త్వరలో తెలుగుదేశం గూటికి వస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. స్థానిక సంస్థలు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. టిడిపి హై కమాండ్ వైసిపి కీలక నేతలపై గురిపెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ టిడిపి గూటికి రావడం ఖాయమని సమాచారం. ఇప్పటికే కాలింగ సామాజిక వర్గానికి చెందిన తమ్మినేని సీతారాం వైసిపి పై ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పుడు అదే బాటలో అదే సామాజిక వర్గానికి చెందిన పిరియా సాయిరాజ్, విజయలక్ష్మి దంపతులు ఉండడం సంచలనగా మారింది. వారు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరితే శ్రీకాకుళం జిల్లా పరిణామాలు శరవేగంగా మారడం ఖాయం.
ఇవి కూడ చదవండి:
-
అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట…! క్యాబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం…
-
మరోసారి డి లిమిటేషన్…! కేంద్రం కసరత్తు మొదలు…
-
మోడీ కొత్త వ్యూహం…! కేంద్ర మంత్రులతో చింతన్ శిబిరం…
-
వణుకుతున్న ఉత్తరాంధ్ర…! దూసుకొస్తున్న వాయుగుండం…
