Homeఆంధ్ర ప్రదేశ్విశాఖకు మెట్రో....! డబుల్ డెక్కర్ కు కేంద్ర ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్‌...

విశాఖకు మెట్రో….! డబుల్ డెక్కర్ కు కేంద్ర ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్‌…

  • అత్యాధునిక ఇంజనీరింగ్ ప్రమాణాలతో డిజైన్

  • ఒకే పిల్లర్ పై దిగువున ఫ్లై ఓవర్, ఎగువన మెట్రో కారిడార్

  • త్వరలో పనులు ప్రారంభం

 

క్రైమ్ మిర్రర్, విశాఖపట్నం: విశాఖ నగర ప్రజలకు, ఉత్తరాంధ్రవాసులకు గుడ్ న్యూస్. సాగరనగరం విశాఖపట్నం ప్రజా రవాణా వ్యవస్థలో సరికొత్త విప్లవానికి తెరలేచింది. దశాబ్దాలుగా విశాఖ నగరవాసులు ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక డబుల్ డెక్కర్ మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్వయంగా వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించడంతో ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు మార్గం సుగమం అయింది. త్వరలో క్షేత్రస్థాయి నిర్మాణ పనులను ప్రారంభించినట్లు కూడా ఆయన స్పష్టం చేశారు.

శరవేగంగా అభివృద్ధి…

విశాఖ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత భారీగా ఐటి పరిశ్రమలు వచ్చాయి. పర్యాటక ప్రాజెక్టుల సైతం నిర్మాణ పనులు జరుపుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా భారీగా ఏర్పాటు అవుతున్నాయి. అదే సమయంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సైతం అందుబాటులోకి వచ్చింది. ఒకవైపు ఐటీ ఉద్యోగులు, ఇంకోవైపు పర్యాటకుల తాకిడి పెరగనున్న నేపథ్యంలో.. భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాలు దృష్టిలో ఉంచుకొని మెట్రో రైల్వే ప్రాజెక్ట్ నిర్మాణ పనులు చేపట్టాలని ఎప్పటినుంచో ప్రతిపాదనలు ఉన్నాయి. విభజన హామీల్లో భాగంగా మెట్రో రైలు ప్రాజెక్టు హామీ ఉంది. ఇన్నాళ్లకు అది కార్యరూపం దాల్చింది. అత్యాధునిక ఇంజనీరింగ్ ప్రమాణాలతో ఈ ప్రాజెక్టును డిజైన్ చేస్తున్నారు. ఒకే పిల్లర్ పై దిగువున ఫ్లై ఓవర్ రోడ్డు మార్గం, ఎగువన మెట్రో రైల్ క్యారిడార్ వెళ్లేలా డబుల్ డెక్కర్ విధానాన్ని అమలు చేయనున్నారు. భూ సేకరణ సమస్యలు, భారీ ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు.. ఇరుకైన కారిడార్లలో సాధారణ రోడ్డు రవాణా, ప్రజా రవాణా రెండింటికి ఇది శాశ్వత పరిష్కార మార్గంగా నిలవనుంది.

అన్ని ప్రాంతాలకు అనుసంధానం…

విశాఖ నగరం భారీగా విస్తరించి ఉంది. తగరపువలస నుంచి మళ్లీ అనకాపల్లి వరకు విశాఖ నగర విస్తీర్ణం వందల కిలోమీటర్లు. ఈ మెట్రో కారిడార్ ద్వారా నగరంలోని ప్రధాన వాణిజ్య ప్రాంతాలు, ఐటీ కారిడార్లు, విద్యా సంస్థలు, పోర్టు ప్రాంతం, ప్రతిపాదిత భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అనుసంధానానికి విస్తృతమైన లబ్ధి చేకూరనుంది. రోడ్డు ట్రాఫిక్ తీవ్రతను గణనీయంగా తగ్గించడంతోపాటు సామాన్యులు, ఉద్యోగులు తక్కువ సమయంలో సురక్షితంగా, కాలుష్య రహితంగా ప్రయాణించేందుకు ఈ ప్రాజెక్టు అత్యంత కీలకం. విశాఖను గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్ గా, ఏపీ ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దాలన్న కూటమి ప్రభుత్వ సంకల్పానికి కేంద్రం ఆమోదం మరింత వేగాన్ని చేకూర్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యంతో శరవేగంగా నిధుల సమీకరణ పూర్తిచేసి.. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఈ మెట్రో ప్రాజెక్టు పూర్తితో వైజాగ్ రూపురేఖలు అంతర్జాతీయ స్థాయిలో మెట్రోపాలిటన్ నగరాల సరసన నిలవడం ఖాయమని అర్థం అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు