క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రభుత్వ ఆస్తుల రక్షణ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కఠిన వైఖరిని అవలంబిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే వారి పట్ల ఏమాత్రం ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు విధ్వంసకారుల నుంచే ఆ నష్టాన్ని భర్తీ చేసేలా, వారి నుంచి నష్టపరిహారం వసూలు చేసేందుకు వీలుగా ఒక కఠినమైన చట్టాన్ని రూపొందించాలని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)కి చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేశారు.
ఇటీవల జరిగిన పలు సంఘటనలను ప్రస్తావిస్తూ సీఎం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీ ముసుగులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్దేశపూర్వకంగా రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలను సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. పార్టీ కేంద్ర కార్యాలయంపై, అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) కార్యాలయంపై జరిగిన దాడులను ఆయన ఖండించారు. ఈ రెండు దాడులకు పాల్పడింది ఒకే వర్గమని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి రౌడీ షీటర్లను ప్రోత్సహించి, వారిని ఉసిగొల్పి ఇలాంటి నేరాలకు, విధ్వంసాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
మరోవైపు, పార్టీ శ్రేణులకు, మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించాలని కోరారు. కూటమిలోని పార్టీల నాయకులు సమన్వయంతో, ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని చోట్లా కూటమి అభ్యర్థుల గెలుపే ఏకైక లక్ష్యంగా పనిచేయాలని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో విజయబాధ్యత పూర్తిగా జిల్లాల ఇన్‌చార్జ్ మంత్రులదేనని ఆయన తేల్చి చెప్పారు. నాయకులంతా ప్రజల్లో ఉంటూ, ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
