టాలీవుడ్, బాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు మరో ప్రతిష్ఠాత్మక అవకాశం దక్కింది. భారతరత్న, ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతున్న బయోపిక్‌లో రష్మిక ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ‘ఎం.ఎస్. – ఎ లెగసీ ఆన్ స్క్రీన్’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో సుబ్బులక్ష్మి పాత్రను పోషించడం రష్మిక కెరీర్లో ప్రత్యేకమైన ప్రాజెక్టుగా నిలవనుంది.
ఎం.ఎస్. సుబ్బులక్ష్మి 110వ జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 16న చెన్నైలో ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ వేడుకకు ప్రముఖ నటుడు కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. కార్యక్రమంలో ఇండియన్ కోరల్ ఎన్సెంబుల్ ప్రత్యేక సంగీత ప్రదర్శనతో ఎం.ఎస్. సుబ్బులక్ష్మికి నివాళి అర్పించనుంది.
ఈ బయోపిక్కు ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. రాక్‌లైన్ వెంకటేశ్‌తో పాటు అల్లు అరవింద్, బన్నీ వాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సుబ్బులక్ష్మి పాత్ర కోసం చిత్రబృందం తొలుత పలువురు ప్రముఖ నటీమణుల పేర్లను పరిశీలించినట్లు సమాచారం. సాయి పల్లవి, రుక్మిణి వసంత్ వంటి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో సాయి పల్లవి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం నిర్వహించిన స్క్రీన్ టెస్ట్‌లో రష్మిక ఈ పాత్రకు ఎంపికైనట్లు సమాచారం.
ఎం.ఎస్. సుబ్బులక్ష్మి కేవలం కర్ణాటక సంగీత ప్రపంచానికే పరిమితమైన కళాకారిణి కాదు. ఆమె సినిమాల్లోనూ నటించారు. ‘సేవాసదనం’, ‘శకుంతలై’, ‘సావిత్రి’, ‘మీరా’ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దీంతో ఆమె జీవితాన్ని తెరపై ఆవిష్కరించే ఈ బయోపిక్‌లో రష్మికకు నటనతో పాటు పాత్రకు తగిన హావభావాలు, సంగీతానికి సంబంధించిన అంశాలను కూడా సమర్థంగా చూపించాల్సిన సవాల్ ఉండనుంది.
ఇక రష్మిక ప్రస్తుతం పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆమె నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘మైసా’ నవంబర్ 27న విడుదల కానుంది. అలాగే విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న పాన్-ఇండియా యాక్షన్ డ్రామా ‘రణబాలి’ అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.
also read: సూర్య– జ్యోతిక 20 ఏళ్ల బంధం.. మరోసారి పెళ్లి ప్రమాణాలు
