క్రైమ్ మిర్రర్ : అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానంలో మహిళ హద్దులు మీరి ప్రవర్తించడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఈ ఘటన సెప్టెంబర్ 11న బాల్టిమోర్ నుంచి మియామీకి వెళ్తున్న విమానంలో చోటుచేసుకుంది. విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే 9డీ సీటులో కూర్చున్న ఓ మహిళ అకస్మాత్తుగా తన దుస్తులు తొలగించడంతో తోటి ప్రయాణికులు అవాక్కయ్యారు. అంతటితో ఆగకుండా ఆమె ఇతర ప్రయాణికులతోనూ అభ్యంతరకరంగా ప్రవర్తించినట్లు సమాచారం. దీంతో కొందరు ప్రయాణికులు విషయాన్ని విమాన సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు.
క్యాబిన్ సిబ్బంది వెంటనే పరిస్థితిని పైలట్లకు తెలియజేశారు. మరోవైపు మియామీ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులకు కూడా సమాచారం అందించడంతో అక్కడి సిబ్బంది అప్రమత్తమయ్యారు. మహిళ ప్రవర్తనతో విమానంలో గందరగోళ పరిస్థితి నెలకొన్నప్పటికీ, విమానాన్ని గమ్యస్థానమైన మియామీకి తీసుకెళ్లాలని పైలట్లు నిర్ణయించారు. చివరకు విమానం రాత్రి 11.23 గంటలకు మియామీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కావడంతో పోలీసులు విమానం వద్దకు చేరుకుని సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించి మహిళ గుర్తింపు, ఆమె అలా ప్రవర్తించడానికి గల కారణాలను పోలీసులు ఇంకా వెల్లడించలేదు. ఘటన జరిగిన సమయంలో విమానంలో సుమారు 160 మంది ప్రయాణికులు ఉన్నట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా.. విమానం బాల్టిమోర్ నుంచి ఇప్పటికే దాదాపు రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరినట్లు సమాచారం. ఇంతలో మహిళ చేసిన హంగామాతో ప్రయాణికులు మరింత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఘటనపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
also read : ఫ్రిజ్ పేలి నలుగురు మహిళలు మృతి
