క్రైమ్ మిర్రర్ : ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. పెళ్లైన ఓ యువతి తన చిన్ననాటి క్లాస్మేట్, ప్రియుడితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో ఆమె భర్త పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఆ జంటను గుర్తించి లక్నోకు తీసుకువచ్చినప్పటికీ.. యువతి మాత్రం తన ప్రియుడితోనే జీవిస్తానని స్పష్టం చేసింది. దీంతో చివరకు ఆమె భర్త తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
లక్నోకు చెందిన ప్రాంతీయ రక్షక్ దళ్ (PRD) జవాన్ విక్కీకి ఏడాది క్రితం సొనాలితో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కూడా సొనాలికి మలిహాబాద్ ప్రాంతంలో తనతో కలిసి చదువుకున్న ఓ యువకుడితో సన్నిహిత సంబంధం కొనసాగినట్లు తెలుస్తోంది. వారిద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకునేవారని సమాచారం. ఈ క్రమంలో సెప్టెంబర్ 5న సొనాలి అత్తవారింటి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. అనంతరం తన ప్రియుడితో కలిసి వెళ్లినట్లు కుటుంబ సభ్యులకు తెలిసింది. ఆమె కనిపించకుండా పోవడంతో భర్త విక్కీతో పాటు అత్తింటి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమె ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు వివిధ ప్రాంతాల్లో గాలింపు చేపట్టి చివరకు సొనాలి తన ప్రియుడితో కలిసి హర్దోయ్‌లో ఉన్నట్లు గుర్తించారు. సెప్టెంబర్ 9న ఇద్దరినీ లక్నోకు తీసుకువచ్చారు. అనంతరం సొనాలిని భర్త వద్దకు తిరిగి వెళ్లేలా కుటుంబ సభ్యులు, పోలీసులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయితే సొనాలి మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. తన ప్రియుడితోనే కలిసి జీవించాలనుకుంటున్నానని, భర్తతో తిరిగి కాపురం చేయడానికి ఇష్టపడటం లేదని స్పష్టం చేసింది. దీంతో పరిస్థితిని అర్థం చేసుకున్న విక్కీ ఆమెపై బలవంతం చేయకుండా మరో నిర్ణయం తీసుకున్నాడు.
ఇరు కుటుంబాల సమక్షంలో చర్చలు జరిపిన అనంతరం సొనాలి తనకు ఇష్టమైన వ్యక్తితోనే జీవించాలనుకుంటే అదే జరగాలని విక్కీ నిర్ణయించుకున్నాడు. చివరకు ఒక ఆలయంలో తన భార్యకు ఆమె ప్రియుడితో వివాహం జరిపించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భార్య తనను వదిలి ప్రియుడితో వెళ్లిపోయినప్పటికీ.. ఆమె నిర్ణయాన్ని గౌరవించి దగ్గరుండి వివాహం జరిపించిన భర్త వైఖరిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగానే కాకుండా సోషల్ మీడియాలోనూ చర్చకు దారితీసింది.
also read : భార్యతో అక్రమ సంబంధం ఉందన్న అనుమానం.. స్నేహితుడి దారుణ హత్య
