-
అధికార కాంగ్రెస్ కు గట్టిగానే కౌంటర్ ఇచ్చిన గులాబీ పార్టీ
-
తెలంగాణ భవన్ లో భారీ సెట్టింగ్
-
సోషల్ మీడియా స్పేస్ భర్తీలో బిఆర్ఎస్ సక్సెస్
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఒకవైపు అసెంబ్లీ జరుగుతోంది. కానీ విపక్ష భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు సస్పెన్షన్కు గురయ్యారు. శాసనసభలో సెక్షన్ 22ఏ సవరణలు, ప్రజాప యోగ బిల్లులపై కీలక చర్చ సాగుతోంది.
అయితే తమపై సస్పెన్షన్ వేటు వేయడంతో వినూత్న ఆలోచన చేశారు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు. శాసనసభకు పోటీగా మాక్ అసెంబ్లీ కొలువు దీర్చారు. తెలంగాణ భవన్ వేదికగా చేసుకొని సభ వాతావరణం కల్పించేలా అసెంబ్లీ నిర్వహించడం ద్వారా గట్టి సంకేతాలు పంపారు. సోషల్ మీడియా, వార్త కథనాలతో రోజంతా ప్రజల్లో నిలవాలని ఎత్తుగడను వేశారు. ఇందుకోసం అచ్చం అసెంబ్లీ లాంటి సెట్టింగ్ కూడా వేశారు.
-
అచ్చం అసెంబ్లీ తరహాలో..
సోషల్ మీడియాతో పాటు డిజిటల్ మీడియా ద్వారా తెలంగాణ ప్రజల్లోకి బలంగా వెళ్లాలని గులాబీ పార్టీ ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తోంది. అందులో భాగంగానే ఈ మాక్ అసెంబ్లీ నిర్వహించింది.
అసెంబ్లీ తరహాలోనే స్పీకర్, సీఎం, మంత్రులు, విపక్ష సభ్యుల పాత్రలతో సభను నడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. తలసాని శ్రీనివాస్ యాదవ్, హరీష్ రావు లాంటి సీనియర్ నేతలు కాంగ్రెస్ పాలనను అనుకరిస్తూ తీవ్రంగా ఎండగట్టారు.
సెక్షన్ 22 ఏ సవరణల నుంచి తెలంగాణ ప్రజలను వేధిస్తున్న ప్రధాన సమస్యలపై కౌంటర్లు ఇచ్చారు. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు విషయంలో వైఫల్యాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు.
-
అన్నింటిపై చర్చ..
ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వెయ్యి రోజుల పాలన పేరుతో సాగుతున్న అవకతవకలు, రైతు భరోసా, రుణమాఫీ, మహిళా మహాలక్ష్మి పథకం బకాయిలు, నిరుద్యోగ నిరసనలపై.. మాక్ అసెంబ్లీ వేదికగా సుదీర్ఘ చర్చలు జరిపింది గులాబీ పార్టీ.
తద్వారా అధికార కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్ లో పడేయాలన్నది వ్యూహం. అసెంబ్లీ నుంచి హరీష్ రావు, కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి తో సహా కీలక ఎమ్మెల్యేలను సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే.
ఈ పరిస్థితుల్లో మాక్ అసెంబ్లీ నిర్వహించి అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి సవాల్ పంపింది. సోషల్ మీడియా వేదికగా డిజిటల్ స్పేస్ శాసించడంలో గులాబీ పార్టీది అంది వేసిన చేయి. ఇప్పుడు కూడా అటువంటి వ్యూహాన్ని అమలు చేయగలిగింది.
