క్రైమ్ మిర్రర్ : కారు లోన్ దరఖాస్తు విషయంలో తండ్రి సహకరించలేదన్న కారణంతో ఓ కుమార్తె తీవ్ర ఆగ్రహానికి గురై పిస్టల్‌తో తండ్రిని బెదిరించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. తండ్రి, వదినపై తుపాకీ గురిపెట్టి చంపేస్తానంటూ బెదిరించిన ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
సాహిబాబాద్ ప్రాంతానికి చెందిన హితేష్ తోమర్‌కు 30 ఏళ్ల ప్రియాంక కుమార్తె. గత రెండేళ్లుగా ఆమె కుటుంబానికి దూరంగా ఉంటోంది. ఈ నెల 8న సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో ప్రియాంక తన స్నేహితురాలితో కలిసి తండ్రి ఇంటికి వెళ్లింది. కారు కొనుగోలు కోసం లోన్‌కు దరఖాస్తు చేశానని, అందుకు సంబంధించిన అప్లికేషన్‌ను ధృవీకరించాలని తండ్రిని కోరింది. అయితే హితేష్ అందుకు అంగీకరించకపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వివాదం ముదరడంతో ప్రియాంక తండ్రితో పాటు వదినతోనూ గొడవకు దిగినట్లు స్థానికులు తెలిపారు. విషయం గమనించిన ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకోవడంతో ఆమె తన స్నేహితురాలితో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయింది.
అయితే సుమారు 25 నిమిషాల తర్వాత ప్రియాంక మళ్లీ స్నేహితురాలితో కలిసి తండ్రి ఇంటి వద్దకు చేరుకుంది. ఈసారి గేటును బలవంతంగా తెరిచి లోపలికి ప్రవేశించిన ఆమె.. తండ్రి, వదిన వైపు పిస్టల్ గురిపెట్టి తీవ్రంగా బెదిరించినట్లు సమాచారం. వారిని కాల్చి చంపుతానంటూ హెచ్చరించినట్లు తెలుస్తోంది. పరిస్థితి విషమించడంతో ప్రియాంక వెంట వచ్చిన స్నేహితురాలు జోక్యం చేసుకుని ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లింది.
ఈ ఘటనతో తీవ్ర ఆందోళనకు గురైన హితేష్ తోమర్ పోలీసులను ఆశ్రయించారు. తన కుమార్తె పిస్టల్‌తో తనను బెదిరించిందంటూ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అక్కడి సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పరిశీలించి ఆధారాలను సేకరించారు. హితేష్ ఫిర్యాదు మేరకు ప్రియాంకతో పాటు ఆమె స్నేహితురాలిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, తండ్రిపై ప్రియాంక పిస్టల్ గురిపెట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
also read : మద్యం మత్తులో గర్భిణికి సర్జరీ.. ప్రాణాలు కోల్పోయిన మహిళ
