క్రైమ్ మిర్రర్ : నగరంలో లంచం తీసుకుంటూ ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. సెక్రటేరియట్‌లో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఆనందేసి రాఘవేందర్, పరిశ్రమ భవన్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న మేడి వినోద్ ఏసీబీ వలలో చిక్కారు.
ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం.. సీఎంఆర్‌ఎఫ్ కింద మంజూరైన రూ.2 లక్షల మెడికల్ రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన చెక్ కోసం ఓ వ్యక్తి సంబంధిత ఉద్యోగులను సంప్రదించాడు. ఈ ప్రక్రియను పూర్తి చేసి చెక్ ఇప్పించేందుకు ఇద్దరు ఉద్యోగులు లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ వ్యవహారంలో మొదటి విడతగా రాఘవేందర్ రూ.5 వేలు తీసుకున్నట్లు ఏసీబీ విచారణలో తేలింది. అనంతరం మిగిలిన మొత్తానికి సంబంధించి సీనియర్ అసిస్టెంట్ మేడి వినోద్ రూ.లక్ష తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పక్కా సమాచారంతో దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు వెల్లడించారు.
లంచం తీసుకుంటున్న సమయంలో అధికారులు నిందితులను అదుపులోకి తీసుకుని, సంబంధిత నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇద్దరు ఉద్యోగులపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. అనంతరం నిందితులను నాంపల్లి జుడిషియల్ కోర్టులో హాజరుపరిచినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం డిమాండ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు హెచ్చరించారు.
also read : సచిన్ టెండూల్కర్ చారిత్రాత్మక రికార్డులకు జో రూట్ చెక్ పెట్టగలడా?
