క్రైమ్ మిర్రర్ : పొలంలో పనులు ముగించుకుని స్నానం చేసేందుకు వాగులోకి దిగిన ఓ యువకుడు నీటిలో గల్లంతై మృతి చెందిన విషాద ఘటన మాగనూర్ మండలం పెగడబండ గ్రామంలో చోటుచేసుకుంది. మృతుడిని గ్రామానికి చెందిన తెలుగు రాము (32)గా గుర్తించారు. స్థానికుల వివరాల ప్రకారం.. రాము గురువారం పొలానికి పురుగుమందు పిచికారీ చేసేందుకు వెళ్లాడు. పని పూర్తయిన అనంతరం సమీపంలోని వాగులో స్నానం చేసేందుకు దిగగా ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతయ్యాడు.
రాము నీటిలో కనిపించకుండా పోవడాన్ని గమనించిన స్థానికులు వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించారు. ఇదే సమయంలో సంగంబండ డ్యాం రిజర్వాయర్‌కు చెందిన రెండు గేట్లు తెరవడంతో వాగులో నీటి ప్రవాహం పెరిగినట్లు సమాచారం. దీంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న అధికారులు డ్యాం గేట్లను మూసివేసి నీటి ప్రవాహాన్ని తగ్గించారు. అనంతరం రాము కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఇసుక కోసం తవ్విన ఓ గుంతలో చిక్కుకున్న రాము మృతదేహాన్ని గుర్తించి బయటకు తీసినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. రాముకు భార్యతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. యువకుడి మృతితో పెగడబండ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
also read : వాయుసేనకు వీడ్కోలు.. కమర్షియల్ పైలట్‌గా అభినందన్ వర్ధమాన్
