బెంగళూరులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఎంతోకాలం తర్వాత జన్మించిన కవల ఆడపిల్లలను కన్న తల్లే నీళ్ల బకెట్లో ముంచి ప్రాణాలు తీసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన దొడ్డబళ్లాపురం పరిధిలోని తలఘట్టపురలో వెలుగుచూసింది.
స్థానికంగా లభించిన వివరాల ప్రకారం.. తలఘట్టపురకు చెందిన రామలింగప్ప (50), ఉమాదేవి (42) దంపతులు. రామలింగప్ప వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఈ దంపతులకు మే 5న ఒకే కాన్పులో ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. చాలా కాలం తర్వాత పిల్లలు పుట్టడంతో కుటుంబ సభ్యులు సంతోషించారు.
అయితే ప్రసవం తర్వాత ఉమాదేవి మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు చిన్నారులను చూసుకోవడంలోనూ ఆమెకు సమస్యలు ఎదురయ్యాయి. ఈ క్రమంలో మంగళవారం ఇద్దరు శిశువులను నీళ్లతో ఉన్న బకెట్లో ముంచినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో కవలలు మృతి చెందారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. చిన్నారుల మృతికి గల పూర్తి కారణాలు, ఘటనకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఉమాదేవి మానసిక పరిస్థితికి సంబంధించిన అంశాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
also read: త్వరలో ప్లాస్టిక్ నోట్లు.. భారత్లో కరెన్సీ రూపం మారనుందా?
