దేశంలో కరెన్సీ నోట్ల రూపంలో కీలక మార్పు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం చలామణిలో ఉన్న కాగితపు నోట్లకు ప్రత్యామ్నాయంగా పాలిమర్ నోట్లను తీసుకొచ్చే దిశగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రక్రియలో భాగంగా పాలిమర్ షీట్ల సరఫరా కోసం ఆర్బీఐ అంతర్జాతీయ స్థాయిలో టెండర్లను ఆహ్వానించింది.
భద్రతకు ప్రాధాన్యం
పాలిమర్ కరెన్సీ నోట్ల తయారీలో ఉపయోగించే షీట్ల ఎంపిక విషయంలో ఆర్బీఐ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలను పరిగణనలోకి తీసుకుని.. పాకిస్తాన్, చైనాతో సంబంధాలున్న సంస్థలను టెండర్ ప్రక్రియ నుంచి దూరంగా ఉంచినట్లు తెలుస్తోంది. ఆగస్టు 18తో టెండర్ల స్వీకరణ ప్రక్రియ పూర్తయింది.
మూడు దేశాల కంపెనీల ఆసక్తి
పాలిమర్ షీట్ల సరఫరా కోసం యూకే, ఆస్ట్రేలియా, వియత్నాంకు చెందిన సంస్థలు పోటీ పడినట్లు సమాచారం. టెండర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆయా కంపెనీలు అందించే నమూనాలను నిపుణులు పరిశీలించనున్నారు. నాణ్యత, భద్రత, సాంకేతిక ప్రమాణాలు తదితర అంశాలను పరీక్షించిన అనంతరం తుది సరఫరాదారును ఎంపిక చేసే అవకాశం ఉంది.
తొలుత రూ.10, రూ.20 నోట్లు
ప్రాజెక్ట్ అమలు జరిగితే.. తొలిదశలో తక్కువ విలువ కలిగిన రూ.10, రూ.20 నోట్లను పాలిమర్‌తో తయారు చేసి చలామణిలోకి తీసుకురావాలని ఆర్బీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అనంతరం ఫలితాలను బట్టి ఇతర విలువల నోట్లపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
కాగితపు నోట్లతో పోలిస్తే పాలిమర్ నోట్లు ఎక్కువ కాలం మన్నికగా ఉండటం, తేమను తట్టుకోవడం, నకిలీ నోట్ల తయారీని అడ్డుకునేందుకు అదనపు భద్రతా లక్షణాలను పొందుపరచడం వంటి ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే తుది నిర్ణయం, అమలు తేదీపై ఆర్బీఐ అధికారిక ప్రకటన కీలకం కానుంది.
also read: హోటల్లో దారుణం.. ప్రియురాలిని కత్తితో పొడిచి హత్య
