గండిగుండం సత్తరువు కూడలి వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన ఓ కారు లారీని బలంగా ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో కారులో ఉన్న డ్రైవర్ మంటల్లో చిక్కుకుని సజీవ దహనమైనట్లు సమాచారం.
ప్రమాదం జరిగిన వెంటనే కారులో మంటలు వ్యాపించడంతో స్థానికంగా తీవ్ర భయాందోళన నెలకొంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే కారు పూర్తిగా కాలిపోయింది.
ప్రమాదానికి అసలు కారణమేంటన్న దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కారు ఏ పరిస్థితుల్లో అదుపుతప్పి లారీని ఢీకొట్టిందనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు ప్రమాదానికి సంబంధించిన ఆధారాలను నమోదు చేసుకున్నారు.
మరోవైపు, ప్రమాదం అనంతరం లారీకి చిక్కిన నంబర్ ప్లేట్ ఆధారంగా మృతుడి వివరాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. మృతుడి గుర్తింపు పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
also read: తుక్కుగూడ నర్సు శిరీష కేసులో కీలక మలుపు.. అత్యాచారం జరిగినట్లు పోస్టుమార్టంలో వెల్లడి
