తుక్కుగూడలో నర్సు శిరీష హత్య కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. శిరీషపై అత్యాచారం జరిగినట్లు పోస్టుమార్టం నివేదికలో నిర్ధారణ అయినట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు కేసులో నిందితుడిగా ఉన్న సనా వుల్లా కూడా అత్యాచారానికి పాల్పడినట్లు అంగీకరించినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం నమోదైన కేసులో అత్యాచారానికి సంబంధించిన సెక్షన్లను పోలీసులు మార్చనున్నట్లు తెలుస్తోంది.
శిరీష ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తూ.. ఆసుపత్రి ప్రాంగణంలోని హాస్టల్లో ఒంటరిగా నివసిస్తోంది. ఈ నెల 29న ఆమె హాస్టల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
రాఖీ పండగ నేపథ్యంలో శిరీషతో కలిసి పనిచేసే మిగతా నర్సులు తమ స్వగ్రామాలకు వెళ్లారు. దీంతో ఆమె హాస్టల్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ దారుణం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
కేసు దర్యాప్తులో భాగంగా పహాడీ షరీఫ్ పోలీసులు ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీతో పాటు ఇతర ఆధారాలను పరిశీలించారు. ఈ క్రమంలో ఆసుపత్రి సమీపంలోని కార్ల మెకానిక్ షాపులో పనిచేసే సనా వుల్లాపై అనుమానం వ్యక్తమైంది. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
విచారణలో నిందితుడు హాస్టల్లోకి కిటికీ మార్గం ద్వారా ప్రవేశించినట్లు తేలినట్లు సమాచారం. శిరీష అత్యాచారాన్ని ప్రతిఘటించడంతో ఆమెపై దాడి చేసి హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు చెబుతున్నారు.
పోస్టుమార్టం నివేదికలో అత్యాచారానికి సంబంధించిన ఆధారాలు వెలుగులోకి రావడంతో కేసు మరింత తీవ్రతరమైంది. తాజాగా నిందితుడి వాంగ్మూలం, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా అత్యాచారానికి సంబంధించిన సెక్షన్లను కేసులో చేర్చేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. శిరీష మృతిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుండగా.. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
also read: హైదరాబాద్లో రెస్టారెంట్ బిల్లు వివాదం.. కుటుంబంపై దాడి
