క్రైమ్ మిర్రర్ : గచ్చిబౌలి పరిధిలో బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తి బ్యాగ్ నుంచి విలువైన బంగారు, వజ్రాభరణాలు చోరీకి గురైన ఘటన కలకలం రేపింది. బ్యాగ్ జిప్ తెరిచి అందులోని నగలను అపహరించిన అనంతరం దొంగలు ఏమీ జరగనట్లుగా బ్యాగ్‌ను తిరిగి అదే చోట ఉంచినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొండాపూర్‌కు చెందిన మెకానికల్ ఇంజినీర్ సి. శ్రీధర్‌బాబు తన భార్యతో కలిసి ఆల్విన్ ఎక్స్ రోడ్స్ నుంచి గుంటూరులోని ఎస్వీఎన్ కాలనీకి అమరావతి బస్సులో ప్రయాణించారు. బస్సు నంబర్ 4219లో ప్రయాణిస్తున్న సమయంలో తమ వద్ద ఉన్న బ్యాగ్‌లోని ప్లాస్టిక్ డబ్బాలో భద్రపరిచిన ఆభరణాలు కనిపించకుండా పోయినట్లు గుర్తించారు. చోరీకి గురైన వాటిలో అన్‌కట్ డైమండ్ నెక్లెస్‌తో పాటు బంగారు గాజు, బంగారు కమ్మ ఉన్నట్లు శ్రీధర్‌బాబు పోలీసులకు తెలిపారు. బస్సులో ప్రయాణిస్తున్న సమయంలోనే గుర్తుతెలియని వ్యక్తులు బ్యాగ్ తెరిచి ఆభరణాలను అపహరించి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
వెనుక సీట్లలో ఉన్న వారిపై అనుమానం
బస్సులో ప్రయాణికుల రద్దీని ఆసరాగా చేసుకుని చోరీకి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. తన వెనుక సీట్లలో ప్రయాణించిన వాజిద్ (42), జబీద్ (28) అనే ఇద్దరు వ్యక్తులపై శ్రీధర్‌బాబు అనుమానం వ్యక్తం చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే వారి ప్రమేయం ఇంకా నిర్ధారణ కాలేదని పోలీసులు పేర్కొన్నారు.బ్యాగ్‌లో ఆభరణాలు కనిపించకపోవడంతో బస్సులో జరిగిన పరిణామాలను గుర్తు చేసుకున్న బాధితుడు పోలీసులకు వివరాలు అందించారు.
సీసీ కెమెరాలతో గాలింపు
బాధితుడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బస్సు బుకింగ్ వివరాలను పరిశీలిస్తూ అందులో ప్రయాణించిన వ్యక్తుల సమాచారాన్ని సేకరిస్తున్నారు. అనుమానితుల కదలికలను గుర్తించేందుకు బస్సు ప్రయాణించిన మార్గంలోని సీసీ కెమెరాల ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నారు.విలువైన బంగారు, వజ్రాభరణాలు చోరీకి గురికావడంతో పోలీసులు కేసును సీరియస్‌గా తీసుకున్నారు. నిందితులను గుర్తించి చోరీకి గురైన ఆభరణాలను స్వాధీనం చేసుకునేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
also read : సైబర్ కేసులో షాక్.. పోలీసుల నోటీసుతో మహిళ ఆత్మహత్య
