Homeజాతీయంఆన్‌లైన్‌లో విషపూరిత ఉమ్మెత్త పండ్ల విక్రయం.. అమెజాన్, స్విగ్గీ, బిగ్‌బాస్కెట్‌లపై FDA చర్యలు

ఆన్‌లైన్‌లో విషపూరిత ఉమ్మెత్త పండ్ల విక్రయం.. అమెజాన్, స్విగ్గీ, బిగ్‌బాస్కెట్‌లపై FDA చర్యలు

ఆన్‌లైన్‌ షాపింగ్‌ ప్లాట్‌ఫామ్‌లలో ఆహార భద్రతకు సంబంధించిన నిబంధనల ఉల్లంఘనపై కర్ణాటక ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (FDA) కీలక చర్యలు చేపట్టింది. మానవ వినియోగానికి ప్రమాదకరమైన ధతూరా.. అంటే ఉమ్మెత్త పండ్లు, విత్తనాలను విక్రయానికి ఉంచిన వ్యవహారంలో ప్రముఖ ఈ-కామర్స్‌, క్విక్‌ కామర్స్‌ సంస్థలపై ఆంక్షలు విధించింది.

అమెజాన్‌, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌, బిగ్‌బాస్కెట్‌లకు సంబంధించిన ఫుడ్‌ లైసెన్సులు, రిజిస్ట్రేషన్లను కర్ణాటక FDA సస్పెండ్‌ చేసినట్లు వెల్లడైంది. వినియోగదారుల ఆరోగ్యానికి ముప్పు కలిగించే ఉత్పత్తులు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండటంపై అధికారులు తీవ్రంగా స్పందించారు.

వెంటనే లిస్టింగ్‌లు తొలగించాలని ఆదేశం

ధతూరా పండ్లు, విత్తనాలకు సంబంధించిన అన్ని ఉత్పత్తుల లిస్టింగ్‌లు, ప్రకటనలను తక్షణమే తొలగించాలని FDA ఆయా సంస్థలను ఆదేశించింది. అంతేకాకుండా ఈ ఉత్పత్తులను విక్రయానికి ఉంచిన విక్రేతలపై తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

సంబంధిత సంస్థలు తమ వివరణలను FDAకి సమర్పించినప్పటికీ.. వాటిపై అధికారులు సంతృప్తి వ్యక్తం చేయలేదని సమాచారం. ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించే ఉత్పత్తులు ప్లాట్‌ఫామ్‌లలో ఎలా లిస్టయ్యాయనే అంశంపై సంస్థల బాధ్యతను FDA ప్రశ్నించింది.

కంప్లయెన్స్‌ నివేదిక ఇచ్చే వరకు సస్పెన్షన్‌

పూర్తిస్థాయి కంప్లయెన్స్‌ నివేదికలను సమర్పించే వరకు లైసెన్సులు, రిజిస్ట్రేషన్లపై విధించిన సస్పెన్షన్‌ కొనసాగుతుందని FDA స్పష్టం చేసింది. వినియోగదారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లు తమ వద్ద లిస్టయ్యే ఆహార ఉత్పత్తులపై మరింత కఠినమైన తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉందని ఈ ఘటన మరోసారి స్పష్టం చేస్తోంది.

గమనిక: ధతూరా (ఉమ్మెత్త) మొక్కలోని కొన్ని భాగాలు విషపూరిత ఆల్కలాయిడ్లు కలిగి ఉండే అవకాశం ఉన్నందున.. గుర్తు తెలియని పండ్లు, విత్తనాలను స్వయంగా వినియోగించడం లేదా ఔషధంగా ఉపయోగించడం ప్రమాదకరం.

also read: ఎల్కతుర్తి కారు హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. తండ్రి ఆదేశాలతోనే కూతురిని చంపిన ప్రియుడు!

తాజావార్తలు