ఆకివీడులో మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 15న ఉప్పుటేరు వద్ద గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం కావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. చివరకు మృతురాలిని ఉప్పాడ దేవిగా గుర్తించారు. కుటుంబ కలహాలే ఈ హత్యకు కారణమని దర్యాప్తులో తేలింది.
మృతదేహాన్ని గుర్తించేందుకు పోలీసులు పలు కోణాల్లో విచారణ చేపట్టారు. ఈ క్రమంలో మహిళ ఎడమ కాలికి అమర్చిన సర్జికల్ స్టీల్ ప్లేట్, స్క్రూ కీలక ఆధారంగా మారాయి. వాటి ఆధారంగా మృతురాలి వివరాలను సేకరించిన పోలీసులు.. ఆమె ఉప్పాడ దేవిగా గుర్తించారు.
దర్యాప్తును మరింత ముమ్మరం చేసిన పోలీసులు.. దేవి భర్త నారాయణరావుపై అనుమానం వ్యక్తం చేశారు. కుటుంబ కలహాల నేపథ్యంలో భీమవరంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో భార్య దేవిని నారాయణరావు గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
హత్య అనంతరం మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించి ఆకివీడు సమీపంలోని ఉప్పుటేరు వద్ద పడేసినట్లు పోలీసులు గుర్తించారు. కేసుకు సంబంధించిన ఆధారాలను సేకరించిన పోలీసులు.. నారాయణరావును అదుపులోకి తీసుకుని తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
also read: భర్త హత్య కేసులో భార్య, ప్రియుడు అరెస్ట్.. వివాహేతర సంబంధంతోనే దారుణం
