మిస్ యూనివర్స్ ఇండియా 2026 కిరీటాన్ని కేరళకు చెందిన 19 ఏళ్ల లా విద్యార్థిని, మోడల్ కాజియా లిజ్ మెజో సొంతం చేసుకుంది. జైపూర్‌లో ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేలో దేశవ్యాప్తంగా ఫైనల్స్‌కు చేరిన 52 మంది అందాల భామలను వెనక్కి నెట్టి ఆమె విజేతగా నిలిచింది. ఈ విజయంతో నవంబర్‌లో ప్యూర్టోరికో వేదికగా జరగనున్న 75వ మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్ తరఫున కాజియా ప్రాతినిధ్యం వహించనుంది.
52 మంది నుంచి విజేతగా..
రాష్ట్రస్థాయి పోటీలు, ఆడిషన్లు, గ్రూమింగ్ సెషన్ల అనంతరం ఎంపికైన 52 మంది ఫైనలిస్టుల్లో కాజియా తన ప్రతిభను చాటుకుంది. గతేడాది మిస్ యూనివర్స్ ఇండియా విజేత మణిక విశ్వకర్మ ఆమెకు విజేత కిరీటాన్ని అందించారు. తమిళనాడుకు చెందిన వైష్ణవి గణేష్ ఫస్ట్ రన్నరప్‌గా నిలవడంతో పాటు ‘మిస్ ఇంటర్నేషనల్ ఇండియా 2026’ టైటిల్‌ను దక్కించుకుంది. గుజరాత్‌కు చెందిన అనుశ్రీ సతవలేకర్ సెకండ్ రన్నరప్‌గా నిలిచింది.
కేరళ నుంచి అరుదైన ఘనత..
అలప్పుళ జిల్లాలోని మావెలిక్కర ప్రాంతానికి చెందిన కాజియా ప్రస్తుతం లా విద్యను అభ్యసిస్తూ మోడలింగ్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చిన్నతనంలో ఎక్కువ కాలం అబుదాబిలో గడిపిన ఆమె అక్కడి పలు విద్యాసంస్థల్లో చదువుకుంది. విభిన్న సంస్కృతుల పరిచయం తనలో ఆత్మవిశ్వాసం, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడానికి దోహదపడిందని ఆమె చెప్పింది.
17 ఏళ్లకే టైటిల్..
కాజియాకు అందాల పోటీల్లో ఇప్పటికే మంచి అనుభవం ఉంది. 17 ఏళ్ల వయసులోనే ‘మిస్ టీన్ దివా 2024’ టైటిల్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత 2025లో ‘మిస్ టీన్ ఇంటర్నేషనల్’ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. ఈ ఏడాది ‘మిస్ యూనివర్స్ కేరళ’ టైటిల్‌ను కూడా గెలుచుకుని రాష్ట్ర స్థాయిలో రికార్డు సృష్టించింది.
కళల్లోనూ ప్రతిభ..
కాజియా కేవలం మోడలింగ్‌కే పరిమితం కాలేదు. పదేళ్లకు పైగా శాస్త్రీయ నృత్యంలో శిక్షణ పొందింది. డ్రమ్స్, వయోలిన్ వాయించడంలోనూ నైపుణ్యం సాధించింది. మలయాళ చిత్రం ‘షైలాక్’లో చిన్న పాత్రలో నటించి సినీ ప్రేక్షకులకు కూడా పరిచయమైంది.
“నా సొంత ఊరిని ప్రపంచానికి చూపిస్తా”
మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం గెలుచుకున్న అనంతరం కాజియా ఆనందం వ్యక్తం చేసింది. ఈ విజయం తనకు ఎంతో ప్రత్యేకమైనదని చెబుతూ.. కిరీటాన్ని కేరళకు తీసుకెళ్లడంతో పాటు తన సొంత ప్రాంతాన్ని ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం లభించడం సంతోషంగా ఉందని పేర్కొంది.
ఈ పోటీల్లో మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్, నటి ఊర్వశీ రౌతేలా, రియా సింఘా, సెలీనా జైట్లీ తదితరులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.
మిస్ యూనివర్స్ కోసం సిద్ధం..
భారత్ తరఫున అంతర్జాతీయ వేదికపై పోటీ పడేందుకు కాజియా ప్రస్తుతం ప్రత్యేక శిక్షణ తీసుకోనుంది. స్టైలింగ్, ఫిట్‌నెస్, పబ్లిక్ స్పీకింగ్‌తో పాటు అంతర్జాతీయ పోటీలకు అవసరమైన ఇతర అంశాల్లోనూ ఆమెకు శిక్షణ ఇవ్వనున్నారు. ప్రస్తుత ఫ్రాంచైజీ కింద మిస్ యూనివర్స్ ఇండియా టైటిల్ గెలుచుకున్న తొలి కేరళ యువతిగా కాజియా గుర్తింపు పొందింది.
also read: ‘నా ప్రపంచం వీళ్లే’ అంటూ స్నేహారెడ్డి పోస్ట్… ఫొటోల్లో బన్నీ మిస్సింగ్.. ఫ్యాన్స్ కామెంట్స్ వైరల్!
