- వడోదర నుంచి ముంబైకి డ్రగ్స్ తరలింపు.. మాజీ ఎయిర్‌హోస్టెస్‌తో పాటు యువకుడి అరెస్ట్
డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో మాజీ ఎయిర్‌హోస్టెస్ అరెస్టు కావడం సంచలనంగా మారింది. వడోదర నుంచి ముంబైకి కారులో భారీగా మత్తుపదార్థాలను తరలిస్తున్న ఇద్దరిని సూరత్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు రూ.30 లక్షల విలువైన 977 గ్రాముల మెఫెడ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ముంబై శాంతాక్రూజ్‌కు చెందిన మాన్సీ సయ్యద్ (41) గతంలో మలేషియన్ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేసింది. ప్రస్తుతం డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలో వడోదర నుంచి ముంబై వైపు ఆమె కారులో డ్రగ్స్ తరలిస్తున్నట్లు పక్కా సమాచారం అందుకున్న సూరత్ పోలీసులు సోమవారం ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై నిఘా పెట్టారు.
టోల్ ప్లాజా సమీపంలో అనుమానాస్పదంగా వెళ్తున్న మాన్సీ కారును పోలీసులు ఆపి తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో 977 గ్రాముల మెఫెడ్రోన్ బయటపడింది. దాని విలువ సుమారు రూ.30 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. డ్రగ్స్‌తో పాటు మొబైల్ ఫోన్లు, ప్యాకింగ్ కవర్లు, కంటైనర్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మాన్సీతో పాటు ఆమెకు సహకరిస్తున్నట్లు అనుమానిస్తున్న సోహైల్ సులేమాన్ షేక్ (20)ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ప్రాథమిక విచారణలో మాన్సీకి చాలాకాలంగా డ్రగ్స్ సరఫరా నెట్‌వర్క్‌తో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
అధికారుల ప్రకారం.. 2015 నుంచే మాన్సీకి డ్రగ్స్ సరఫరా వ్యవహారాలతో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. 2021లో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో సుమారు 100 గ్రాముల డ్రగ్స్‌తో ఆమె పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. ఆ కేసులో ఆమె దాదాపు నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించినట్లు వెల్లడించారు.
గత కేసులో వెలుగులోకి వచ్చిన పరిచయాలు, తాజా డ్రగ్స్ రవాణా వెనుక ఉన్న నెట్‌వర్క్, ఇందులో మరెవరైనా ప్రమేయం ఉందా అనే కోణాల్లో సూరత్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మాన్సీ గతంలో పనిచేసిన రంగం, ఆమెకు ఉన్న పరిచయాలు డ్రగ్స్ నెట్‌వర్క్‌కు ఎలా ఉపయోగపడ్డాయన్న అంశంపైనా అధికారులు ఆరా తీస్తున్నారు.
also read: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై చర్యలకు రంగం సిద్ధం?- టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ కీలక నివేదిక
