ప్రియుడిని పెళ్లి చేసుకునేందుకు తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో వారిని హత్య చేసిన యువతి.. తాజాగా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
వికారాబాద్ జిల్లాకు చెందిన సురేఖ గతంలో సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేసేది. ఆ సమయంలో ఓ యువకుడితో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ వివాహం చేసుకోవాలని భావించినప్పటికీ.. ఆమె తల్లిదండ్రులు అందుకు అంగీకరించలేదని సమాచారం.
దీంతో ఈ ఏడాది జనవరిలో వికారాబాద్ జిల్లా యాచారంలో ఉన్న తన తల్లిదండ్రులకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో సురేఖను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఇటీవలే ఆమె జైలు నుంచి విడుదలైనట్లు తెలుస్తోంది.
విడుదల అనంతరం సంగారెడ్డికి వచ్చిన సురేఖ.. శాంతినగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటోంది. తాజాగా అదే హాస్టల్‌లో ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సురేఖ ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. గతంలో తల్లిదండ్రుల హత్య కేసులో నిందితురాలిగా ఉన్న ఆమె.. తాజాగా ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
also read: అమరావతి మహిళా ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు నవజాత శిశువులు మృతి
