బాలీవుడ్లో హీరోలు, హీరోయిన్లకు మధ్య కనిపించే వయసు వ్యత్యాసం, మహిళా నటీమణులు ఎదుర్కొంటున్న వివక్షపై సీనియర్ నటి మనీషా కొయిరాలా చేసిన పాత వ్యాఖ్యలు ప్రస్తుతం మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ నటి సిమీ గరేవాల్ నిర్వహించిన చాట్ షోలో మనీషా ఈ అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.
మహిళా నటీమణుల విషయంలో చిత్ర పరిశ్రమలో ఇప్పటికీ కొన్ని భిన్నమైన ప్రమాణాలు ఉన్నాయని మనీషా కొయిరాలా అభిప్రాయపడ్డారు. వయసు పెరిగిన తర్వాత కూడా పలువురు పురుష నటులు కథానాయకులుగా కొనసాగుతుండగా.. మహిళా నటుల విషయంలో మాత్రం పెళ్లి, వయసు వంటి అంశాలు వారి కెరీర్‌పై ప్రభావం చూపుతున్నాయని ఆమె పేర్కొన్నారు.
40, 50 ఏళ్ల వయసున్న హీరోల సరసన చాలా చిన్న వయసు ఉన్న హీరోయిన్లను ఎంపిక చేయడం సాధారణంగా మారిందని మనీషా వ్యాఖ్యానించారు. అదే వయసు దాటిన మహిళా నటీమణులను కథానాయికలుగా ఎందుకు చూడకూడదనే ప్రశ్నను ఆమె లేవనెత్తారు.
సినిమా రంగంలో మహిళలకు ఎదురయ్యే పరిమితులు, వివక్షపై కూడా ఆమె మాట్లాడారు. అయితే పరిస్థితులు ఎప్పటికీ ఒకేలా ఉండవని, మహిళలు తమ ప్రతిభ, పనితీరుతో ఈ విధానాలను మార్చేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఇదే చర్చలో సిమీ గరేవాల్ స్పందిస్తూ.. సినిమాల్లో మహిళా పాత్రలను కొన్ని సందర్భాల్లో కథానాయకుడి అవసరాలకు పరిమితమైన పాత్రలుగా చూపించడం కూడా సమస్యకు ఒక కారణమై ఉండొచ్చని పేర్కొన్నారు.
దీనిపై మనీషా కొయిరాలా మాట్లాడుతూ.. ప్రేక్షకుల ఆదరణ, ప్రశంసలు అందుకోవడం సంతోషకరమే అయినప్పటికీ, మహిళలను కేవలం వారి రూపం లేదా శరీర సౌందర్యం ఆధారంగా మాత్రమే అంచనా వేయడం సరికాదని అన్నారు. నటీమణులు తమ ప్రతిభ, నటన, పని ద్వారా గుర్తింపు పొందేలా తమ స్థానాన్ని తామే బలపరుచుకోవాలని సూచించారు.
తన ప్రతిభను గుర్తించాల్సిందిగా మహిళా నటులు స్పష్టంగా చెప్పగలగాలని, ప్రేక్షకుల దృష్టిని కేవలం శారీరక రూపం నుంచి నటన వైపు మళ్లించాల్సిన అవసరం ఉందని ఆమె వివరించారు.
మనీషా కొయిరాలా గతంలో చేసిన ఈ వ్యాఖ్యలు తాజాగా మరోసారి చర్చకు రావడంతో.. బాలీవుడ్లో వయసు, లింగ వివక్ష, మహిళా నటీమణులకు లభించే అవకాశాలపై సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది.
also read: బ్రిజ్ భూషణ్ సంచలన వ్యాఖ్యలు.. రామ్‌దేవ్‌పై మరోసారి తీవ్ర ఆరోపణలు
