బెంగళూరులోని ఓ ప్రముఖ రెస్టారెంట్లో కస్టమర్‌కు ఎదురైన అనుభవం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. కస్టమర్ పేరుకు బదులుగా అతడి శారీరక రూపాన్ని ఉద్దేశిస్తూ బిల్లుపై అభ్యంతరకరమైన పదాలు నమోదు చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనపై రెస్టారెంట్ యాజమాన్యం స్పందించి బహిరంగంగా క్షమాపణలు చెప్పింది.
కోరమంగళలోని ‘సుబ్కో ది క్రాఫ్టరీ’ ఔట్లెట్లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. తనకు సంబంధించిన బిల్లులో పేరు స్థానంలో ‘లిటిల్ ఫ్యాట్ బ్లాక్ షర్ట్’ అని నమోదు చేసిన విషయాన్ని గుర్తించిన కస్టమర్.. దీనిపై సోషల్ మీడియా వేదిక రెడిట్‌లో తన అనుభవాన్ని పంచుకున్నారు.
ఆర్డర్ చేసి, బిల్లు చెల్లించిన తర్వాతే ఈ విషయాన్ని గమనించినట్లు బాధితుడు తెలిపారు. తన పేరును ఉపయోగించకుండా.. తన శరీరాకృతిని, తాను ధరించిన దుస్తులను సూచించేలా వివరాలు నమోదు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎవరో కావాలనే తనను అవమానించే ఉద్దేశంతో ఇలా చేసి ఉంటారని ఆయన ఆరోపించారు.
ఈ పోస్టు ఆన్లైన్లో వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు స్పందించారు. కస్టమర్‌ను అతడి శారీరక రూపంతో గుర్తించడం, అందులోనూ అవమానకరంగా అనిపించే పదాలను ఉపయోగించడం సరైన పద్ధతి కాదని పలువురు అభిప్రాయపడ్డారు. దీంతో బాడీ షేమింగ్‌పై మరోసారి చర్చ మొదలైంది.
వివాదం ముదరడంతో ‘సుబ్కో కాఫీ రోస్టర్స్’ యాజమాన్యం స్పందించింది. తమ కోరమంగళ ఔట్లెట్లో పనిచేసే ఓ సిబ్బంది ఉద్దేశపూర్వకంగానే కస్టమర్ శారీరక రూపాన్ని బిల్లులో పేర్కొన్నట్లు అంగీకరించింది. బాడీ షేమింగ్‌ను సంస్థ ఏమాత్రం సమర్థించదని స్పష్టం చేసింది.
ఇలాంటి చర్యలు తమ సంస్థ విధానాలకు పూర్తిగా విరుద్ధమని పేర్కొన్న యాజమాన్యం.. ఘటనకు కారణమైన ఉద్యోగిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. బాధిత కస్టమర్‌ను వ్యక్తిగతంగా సంప్రదించేందుకు కూడా ప్రయత్నిస్తున్నామని వెల్లడించింది.
అంతేకాకుండా, భవిష్యత్తులో కస్టమర్ల వివరాలను నమోదు చేసే విధానాన్ని సమీక్షించి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని సంస్థ హామీ ఇచ్చింది. బాధితుడు తమ అంతర్గత ఫిర్యాదుల కమిటీని సంప్రదించవచ్చని కూడా తెలిపింది.
కస్టమర్లను గౌరవంగా, మర్యాదగా చూడటం ప్రతి వ్యాపార సంస్థ బాధ్యత. ఈ ఘటన నేపథ్యంలో బాడీ షేమింగ్‌పై సోషల్ మీడియాలో మరోసారి చర్చ జరుగుతోంది.
also read: బలూచిస్థాన్‌లో హిందూ వ్యాపారి దారుణ హత్య.. దుకాణంలోకి చొరబడి కాల్పులు
