Homeక్రైమ్భవనం కూలిన ఘటనలో యజమాని అరెస్ట్... ఇతర నిర్మాణాల సంగతేంటి..?

భవనం కూలిన ఘటనలో యజమాని అరెస్ట్… ఇతర నిర్మాణాల సంగతేంటి..?

  • గచ్చిబౌలి భవనం కూలిన ఘటనలో యజమాని అరెస్ట్

  • భవనం కూలిన తర్వాతే చర్యలు… మరి ఫిర్యాదుదారుడు చూపించిన ఇతర నిర్మాణాల సంగతేంటి?

  • సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్‌పైనా బాధ్యత లేదా?

  • చర్యలు తీసుకుంటారా… లేక మరో ప్రమాదం జరిగే వరకు వేచి చూస్తారా?

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: గచ్చిబౌలి అంజయ్య నగర్‌లో G+6 భవనం కూలిన ఘటనలో భవన యజమాని సయ్యద్ సాజిద్‌ను రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సాజిద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

ఎలాంటి మున్సిపల్ అనుమతులు లేకుండానే G+6 భవనం నిర్మించినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. నాసిరకం నిర్మాణం కారణంగా శనివారం ఒక్కసారిగా భవనం కూలిపోవడంతో శిథిలాల కింద చిక్కుకుని మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు టైల్స్ కార్మికులు మృతి చెందారు. మృతులను ఉమేష్ ఖారే, మోహపాల్ భలావిగా గుర్తించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ఈ ఘటనలో భవన నిర్మాణంలో కీలక పాత్ర పోషించినట్లు భావిస్తున్న కాంట్రాక్టర్ ఖాజా కోసం పోలీసులు గాలిస్తున్నారు. అరెస్ట్ చేసిన సాజిద్‌ను విచారించి భవన నిర్మాణానికి సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు రాబట్టనున్నట్లు తెలుస్తోంది.

  • భవనం కూలిన తర్వాతే చర్యలా?

ఒక భవనం కూలి ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత యజమానిపై పోలీసులు చర్యలు తీసుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామమే. అయితే ఇక్కడే మరో కీలక ప్రశ్న తెరపైకి వస్తోంది. ఇదే ప్రాంతంలో అనుమతులు, నిర్మాణ నిబంధనలు, భద్రతా ప్రమాణాలకు సంబంధించి ఫిర్యాదులు వచ్చిన ఇతర భవనాలపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు?

ఫిర్యాదులు వచ్చినప్పుడే సంబంధిత అధికారులు స్పందించి, నిర్మాణాలను పరిశీలించి, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే ముందస్తు చర్యలు తీసుకుని ఉంటే ఇలాంటి ప్రమాదాలను నివారించే అవకాశం ఉండేదా? అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రజల్లో వినిపిస్తున్నాయి.

  • సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్‌పైనా బాధ్యత లేదా?

భవన నిర్మాణాలపై ఫిర్యాదులు వచ్చినప్పుడు వాటిని పరిశీలించడం, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం అధికారుల బాధ్యత. అలాంటప్పుడు ఫిర్యాదులపై సకాలంలో స్పందించకుండా, ప్రమాదం జరిగిన తర్వాతే చర్యలు ప్రారంభిస్తే ప్రయోజనం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఫిర్యాదుదారుడు ఇప్పటికే అధికారుల దృష్టికి తీసుకువచ్చిన ఇతర భవనాలపై సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు?
ఆ భవనాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారా?

అనుమతులు లేకుండా లేదా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు ఉన్నట్లు తేలితే వాటిపై కూడా చర్యలు తీసుకుంటారా?
ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదులపై అధికారులు ఏం చేశారు?

ఇప్పుడు ఈ ప్రశ్నలకు అధికారుల సమాధానం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.

భవనం కూలిన తర్వాత యజమానిపై చర్యలు తీసుకోవడం ఒక అంశమైతే, ప్రమాదం జరగకముందే ఫిర్యాదులపై స్పందించి అక్రమ లేదా ప్రమాదకర నిర్మాణాలను గుర్తించి చర్యలు తీసుకోవడం మరింత కీలకం.

అధికారులు ముందస్తుగా స్పందించి ఉంటే ప్రమాదాన్ని నివారించే అవకాశం ఉండేదా? అనే అంశంపైనా సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది.
మరి గచ్చిబౌలి ఘటన తర్వాత అధికారులు ఫిర్యాదుదారుడు పేర్కొన్న మిగతా నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు?

చర్యలు తీసుకుంటారా… లేక మరో ప్రమాదం జరిగే వరకు వేచి చూస్తారా? వేచి చూడాలి…!

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు