-మద్యం కుంభకోణంలో మాజీ మంత్రి అరెస్ట్
-హైదరాబాదులో అదుపులోకి తీసుకున్న ఈడి
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో:- మద్యం కుంభకోణం కేసులో మళ్లీ అరెస్టులు ప్రారంభం అయ్యాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ మద్యం కుంభకోణం జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగుతోంది. ఇంకోవైపు ఈడి అరెస్టుల పర్వానికి దిగింది. అందులో భాగంగా ఈరోజు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు హైదరాబాదులో అరెస్టు చేశారు. ఇప్పటికే పలువురి అరెస్టు జరిగింది. గతంలో ఇదే కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ కూడా రెస్ట్ అయ్యారు. ఆయనతో పాటు మిగతా నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈరోజు కారుమూరిని హైదరాబాదులోని కొండాపూర్ నివాసంలో ఈడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
భారీ కుంభకోణం..
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలు నడిపింది. అప్పట్లోనే వేలకోట్ల రూపాయలు అక్రమ మార్గంలో మద్యం కుంభకోణం ద్వారా పక్కదారి పట్టించారన్న ఆరోపణలు వచ్చాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. ఈ కేసులో కీలక నేతలుగా ఉన్న పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి లాంటి వారి అరెస్టు జరిగింది. అంతకుముందు ఈ కేసులో సూత్రధారిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి అరెస్ట్ కూడా జరిగింది. మరోవైపు ఇదే కేసులో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి అప్రూవర్ గా మారినట్లు ఆరోపణలు వచ్చాయి. అందుకే ఆయన అరెస్టు జరగలేదని ప్రచారం జరిగింది. అయితే ఇదంతా ఆర్థిక కోణంలో జరగడంతో ఈడి ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
మద్యం రవాణా లోనే..
అయితే తాజాగా మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు వెనుక మద్యం రవాణా అంశం కీలక పాత్ర పోషించింది. అప్పట్లో మద్యం రవాణా కోసం ఇచ్చిన టెండర్లలో సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ ముందు పెట్టి మీరు అక్రమ దందా నడిపించినట్లు ఈడి గుర్తించింది. ఈ వ్యవహారంలోనే మాజీమంత్రి కారుమూరి అరెస్టు జరిగినట్లు తెలుస్తోంది. అయితే కారుమూరి అరెస్టుపై ఈడి ఎంతవరకు అధికారికంగా ప్రకటన చేయలేదు. అయితే విచారణ అనంతరం ఆరుమూరిని కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది. మద్యం కుంభకోణం లో మళ్లీ అరెస్టుల పర్వం ప్రారంభం కావడంతో వైసీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి. తదుపరి అరెస్టు ఎవరిది అనేదానిపై ప్రధానంగా చర్చ నడుస్తోంది.
