క్రైమ్ మిర్రర్ : ముంబైలో సంచలనం రేపిన కోడలి హత్య కేసులో పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. తనపై గృహహింస కేసు పెట్టిందన్న కోపంతో ఓ అత్త.. ఇంటి పనిమనిషికి డబ్బులు ఇచ్చి కోడలిని హత్య చేయించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం ఈ ఘటనను బాత్‌రూమ్‌లో ప్రమాదవశాత్తు జారిపడినట్లుగా చిత్రీకరించేందుకు నిందితులు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. స్వప్నకు 2013లో ప్రమోద్‌తో వివాహమైంది. పెళ్లయిన రెండేళ్ల తర్వాత భర్తతో పాటు అత్తింటి కుటుంబ సభ్యుల నుంచి శారీరక, మానసిక వేధింపులు ఎదుర్కొన్నట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. గృహహింస, దాడి, ప్రాణహాని ఆరోపణలపై కేసు నమోదై, విషయం కోర్టు విచారణలో ఉంది.
2024 ఆగస్టులో ప్రమోద్, అతడి కుటుంబ సభ్యులు స్వప్నను క్షమాపణ కోరడంతో పాటు ఇకపై ఎలాంటి ఇబ్బందులు కలిగించబోమని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఆ తర్వాత కొంతకాలం భర్తతో కలిసి విఖ్రోలి ప్రాంతంలో నివసించిన స్వప్న.. అనంతరం ఘాట్‌కోపర్‌లోని అత్తింటికి తిరిగి వెళ్లింది. అయితే తమపై కేసు పెట్టినందుకు 65 ఏళ్ల అత్త ధనలక్ష్మి కోడలిపై తీవ్ర ఆగ్రహం పెంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఇంటి పనిమనిషి, ఆమె కుటుంబ సభ్యులతో కలిసి స్వప్నను హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు దర్యాప్తులో తేలింది. ఇందుకోసం వారికి రూ.3 లక్షలు చెల్లించినట్లు పోలీసులు వెల్లడించారు.
హత్య జరిగిన అనంతరం అర్ధరాత్రి స్వప్న మామ ఆమె తండ్రికి ఫోన్ చేసి.. బాత్‌రూమ్‌లో జారిపడి తలకు గాయమైందని, ఆస్పత్రికి తరలించినట్లు చెప్పాడు. స్వప్న తండ్రి వెంటనే ఆస్పత్రికి చేరుకోగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే స్వప్న తలపై లోతైన గాయంతో పాటు ముఖం, మెడ, భుజాలపై కూడా గాయాల గుర్తులు కనిపించడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. దీంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో అత్త ధనలక్ష్మి.. స్వప్న మద్యం మత్తులో బాత్‌రూమ్‌లో జారిపడి మృతి చెందిందని చెప్పినట్లు సమాచారం. అయితే దర్యాప్తులో ఆమె చెప్పిన వివరాలు పొంతన లేకపోవడంతో పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు.
చివరకు గృహహింస కేసుపై పగతోనే స్వప్నను హత్య చేయించేందుకు కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ధనలక్ష్మితో పాటు పనిమనిషి మంగళబాయి, ఆమె భర్త సురేష్ గణపత్ జాదవ్, వారి కుమార్తె శివాని, కుమారుడు సాజన్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. స్వప్న భర్త ప్రమోద్‌తో పాటు ఇతర కుటుంబ సభ్యుల పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
also read : సోనియా గాంధీ ఆత్మకథ త్వరలో విడుదల.. తల్లి కష్టాలను గుర్తుచేసుకున్న రాహుల్, ప్రియాంక
