క్రైమ్ మిర్రర్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మంగళవారం సాయంత్రం విషాద ఘటన చోటుచేసుకుంది. భార్యను రైలు నుంచి దించేందుకు ప్రయత్నించిన ఓ పోస్టుమాస్టర్ ప్రమాదవశాత్తు ప్లాట్‌ఫామ్, రైలు మధ్యలో పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. జనగామ జిల్లా ఘన్పూర్ మండలం పామనూర్ గ్రామానికి చెందిన కందుకూరి గోపాల్ కిషన్ (57) పోస్టుమాస్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మంగళవారం స్టేషన్ ఘన్పూర్ నుంచి సికింద్రాబాద్‌కు వచ్చారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని రెండో నంబర్ ప్లాట్‌ఫామ్‌పై నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ నిలిచి ఉంది. ఈ సమయంలో గోపాల్ కిషన్ భార్య జయ టాయిలెట్‌కు వెళ్లేందుకు రైలులోకి ఎక్కారు. ఆమెను తిరిగి కిందకు దించేందుకు గోపాల్ కిషన్ ప్రయత్నిస్తున్న సమయంలో అనుకోకుండా రైలు కదిలింది. రైలు కదులుతున్న సమయంలో అదుపుతప్పిన గోపాల్ కిషన్ ప్రమాదవశాత్తు ప్లాట్‌ఫామ్, రైలు మధ్యలో పడిపోయారు. ఈ ఘటనలో ఆయన ఎడమ చేతికి తీవ్ర గాయాలు కావడంతో పాటు నడుము భాగంలో తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
ప్రమాదాన్ని గుర్తించిన రైల్వే సిబ్బంది వెంటనే స్పందించి గోపాల్ కిషన్‌ను బయటకు తీసి అంబులెన్స్‌లో శ్రీకర ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో రాత్రి సుమారు 7.30 గంటల సమయంలో ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.
also read : రీల్స్ కోసం రైల్వే ట్రాక్‌పైకి.. ఎంఎంటీఎస్ రైలు ఢీకొని యువకుడు మృతి
