గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై పోలీసులు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా పరిగి పట్టణంలోని జిమ్‌ఖానా గ్రౌండ్ వద్ద పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 1.1 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల సమాచారం ప్రకారం.. జిమ్‌ఖానా గ్రౌండ్ పరిసరాల్లో గంజాయి అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారం అందడంతో మంగళవారం సాయంత్రం సుమారు 4 గంటల నుంచి 6 గంటల మధ్య ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అదే సమయంలో TS 07 FB 1825 నంబర్ గల స్కూటీపై ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా రావడంతో పోలీసులు వారిని ఆపి తనిఖీ చేశారు.
వారి వద్ద ఉన్న బ్యాగ్‌ను పరిశీలించగా సుమారు 1 కిలో 100 గ్రాముల గంజాయి బయటపడినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ముగ్గురినీ అదుపులోకి తీసుకుని విచారించగా.. తన్వీర్ అహ్మద్, మహమ్మద్ ఉమర్, అబ్దుల్ కలీమ్‌గా గుర్తించారు.
విచారణలో ప్రధాన నిందితుడిగా పేర్కొన్న తన్వీర్ అహ్మద్ బీహార్‌లోని తన స్వగ్రామం నుంచి గంజాయిని తీసుకొచ్చి పరిగిలోని మరో ఇద్దరికి అధిక ధరకు విక్రయిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం వారు గంజాయిని ఇతరులకు విక్రయిస్తూ లాభాలు పొందుతున్నట్లు తెలిపారు.
ఈ కేసులో ముగ్గురినీ పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 1.1 కిలోల గంజాయితో పాటు స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సేవించడం, విక్రయించడం, అక్రమంగా రవాణా చేయడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. గంజాయి అక్రమ రవాణా లేదా విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.
also read: 9 ఏళ్ల బాలికను స్తంభానికి కట్టేసి చిత్రహింసలు.. దహనం చేస్తామని బెదిరింపులు..!
