Homeవైరల్అనసూయపై కేసు.. తగ్గేదేలే అంటున్న నటి! ‘నా మాటలకు కట్టుబడే ఉన్నా’ అంటూ స్ట్రాంగ్ కౌంటర్

అనసూయపై కేసు.. తగ్గేదేలే అంటున్న నటి! ‘నా మాటలకు కట్టుబడే ఉన్నా’ అంటూ స్ట్రాంగ్ కౌంటర్

ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణలో రాజకీయంగా, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. సనాతన ధర్మం, ‘జై శ్రీరామ్’ నినాదం పేరుతో కొందరు అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని బోరబండ పోలీస్ స్టేషన్‌లో బీజేపీ నాయకులు అనసూయపై ఫిర్యాదు చేశారు. ఆమె వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. సోషల్ మీడియాలో బాధ్యతాయుతంగా మాట్లాడాలని, మతపరమైన అంశాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం సరికాదని బీజేపీ నేతలు పేర్కొన్నారు. అనసూయపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

బీజేపీ నేతల ఫిర్యాదు నేపథ్యంలో బోరబండ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామంపై అనసూయ కూడా తన వ్యాఖ్యలను వెనకేసుకొచ్చారు. ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు.

తన ఉద్దేశం ఏ మతాన్ని లేదా ధర్మాన్ని కించపరచడం కాదని అనసూయ వెల్లడించారు. కేవలం నినాదాలు చేయడం కంటే మనిషి ప్రవర్తన, నైతిక విలువలు ముఖ్యమని చెప్పడమే తన వ్యాఖ్యల ఉద్దేశమని తెలిపారు. తాను సనాతన ధర్మాన్ని గౌరవిస్తానని, శ్రీరాముడిని, ఆంజనేయ స్వామిని ఆరాధిస్తానని పేర్కొన్నారు.

తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుంటున్న వారిపై కూడా అనసూయ ఘాటుగా స్పందించారు. తాను చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నానని, తన వ్యాఖ్యలతో కొందరి అసలు స్వరూపాలు బయటపడుతున్నాయని వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం అనసూయపై నమోదైన కేసు, ఆమె చేసిన తాజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వివాదం మరింత ఎలాంటి మలుపు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.

also read: బంకిపుర్ ఎమ్మెల్యేగా ప్రశాంత్ కిషోర్ ప్రమాణ స్వీకారం.. ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో పీకే కొత్త అధ్యాయం!

తాజావార్తలు