క్రైమ్ మిర్రర్ : దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వేదికగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. అయితే లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ వేడుకలకు హాజరుకాలేదు. రాహుల్ గాంధీ, ఖర్గే ఇద్దరూ ఎర్రకోట వద్ద జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు వరుసగా రెండో ఏడాది దూరంగా ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. సాధారణంగా స్వాతంత్య్ర దినోత్సవం వంటి జాతీయ కార్యక్రమాలకు అధికార, ప్రతిపక్షాలకు చెందిన అగ్రనేతలు రాజకీయ విభేదాలను పక్కనపెట్టి హాజరవుతూ వస్తున్నారు. గతంలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సహా కాంగ్రెస్ ముఖ్య నేతలు ఈ వేడుకల్లో పాల్గొనేవారు. అయితే గత ఏడాదితో పాటు ఈ ఏడాది కూడా ఇద్దరూ కార్యక్రమానికి హాజరుకాకపోవడం ఆసక్తికరంగా మారింది. అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ విభేదాలు మరింత తీవ్రమవుతున్నాయనే చర్చకు ఈ పరిణామం కారణమైంది. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లోనూ ప్రభుత్వ, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.
2024లో సీటు వివాదం
రాహుల్ గాంధీ చివరిసారిగా 2024లో ఎర్రకోట వద్ద జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ఆ సమయంలో ఆయనకు కేటాయించిన సీటుపై వివాదం చెలరేగింది. లోక్సభ ప్రతిపక్ష నేతగా క్యాబినెట్ హోదా కలిగిన రాహుల్ గాంధీకి రెండో వరుసలో సీటు కేటాయించడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రతిపక్ష నేతకు ప్రోటోకాల్ ప్రకారం తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉన్నప్పటికీ సీటు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని కాంగ్రెస్ నేతలు అప్పట్లో విమర్శించారు. రాహుల్ గాంధీకి జరిగిన అవమానం కాదని, ఆయనకు ఓటేసిన ప్రజలకు జరిగిన అవమానమని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. లోక్సభ ప్రతిపక్ష నేతకు క్యాబినెట్ మంత్రి హోదా ఉంటుంది. అందువల్ల జాతీయ స్థాయి అధికారిక కార్యక్రమాల్లో ఆయనకు ప్రోటోకాల్ ప్రకారం తగిన స్థానం కల్పించాల్సి ఉంటుందని కాంగ్రెస్ వాదించింది. ఈ వివాదం తర్వాత రాహుల్ గాంధీ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
ఇదిలా ఉండగా, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే గైర్హాజరుపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య పెరుగుతున్న రాజకీయ విభేదాలు జాతీయ కార్యక్రమాలపైనా ప్రభావం చూపుతున్నాయనే చర్చ జరుగుతోంది. రాజకీయ విభేదాలను పక్కనపెట్టి ఇలాంటి జాతీయ వేడుకలకు హాజరయ్యే సంప్రదాయం కొనసాగాలని కొందరు అభిప్రాయపడుతున్నారు.
also read : విజయ్ తల్లిదండ్రుల పక్కనే త్రిష.. ఫోర్ట్ సెయింట్ జార్జిలో అందరి చూపు ఆమెపైనే
