క్రైమ్ మిర్రర్ : నల్సార్ విశ్వవిద్యాలయానికి చెందిన 2026 బ్యాచ్ విద్యార్థులపై చర్యలు తీసుకోవాలన్న బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్ణయంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం, విద్యార్థులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు కలిగి ఉన్నారని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో బీసీఐ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది.
విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి సీజేఐని ముఖ్య అతిథిగా ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తూ సుమారు 450 మంది విద్యార్థులు యూనివర్సిటీ అధికారులకు లేఖ రాయడంతో వివాదం మొదలైంది. అనంతరం విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని బీసీఐ భావించింది. 2026 బ్యాచ్ విద్యార్థులను న్యాయవాదులుగా నమోదు చేయవద్దని రాష్ట్ర బార్ కౌన్సిళ్లకు ఆదేశాలు జారీ చేయడంతో విషయం మరింత తీవ్రతరమైంది.
ఈ నిర్ణయంపై విచారణ సందర్భంగా సీజేఐ సూర్యకాంత్ ఘాటుగా స్పందించారు. విద్యార్థులకు, తనకు మధ్య ఉన్న అంశంలో బీసీఐ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని స్పష్టం చేశారు. అయితే, తాము గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకున్నామని బీసీఐ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
ఈ నేపథ్యంలో తదుపరి విచారణను సుప్రీంకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. పేపర్ లీక్ అంశంపై ఛలో సంసద్ కార్యక్రమంలో విద్యార్థులపై పోలీసుల వ్యవహారాన్ని సవాలు చేసిన కేసులో సుప్రీంకోర్టు వైఖరిపై విద్యార్థులు గతంలో అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం కూడా ఈ వివాదానికి నేపథ్యంగా ఉంది.
also read : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం…! వేసవి నాటికి మెట్రో అదనపు కోచ్‌లు…
