క్రైమ్ మిర్రర్ : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ఘట్కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు, భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి ఆమెపై ఇటుకతో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా సలకలపూర్కు చెందిన మాధవి (37)కి సుమారు 18 ఏళ్ల క్రితం కాట్రావత్ రాజు (44)తో వివాహమైంది. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. గత 15 ఏళ్లుగా వారు ఘట్కేసర్లోని ద్వారకానగర్‌లో నివసిస్తున్నారు.
రాజు కొంతకాలంగా మద్యానికి బానిసై, భార్యపై అనుమానంతో తరచూ వేధింపులకు పాల్పడేవాడని పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి మద్యం మత్తులో భార్యపై ఇటుకతో విచక్షణ రహితంగా దాడి చేసినట్లు తెలిపారు. తీవ్రంగా గాయపడిన మాధవి స్పృహ కోల్పోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రాజుపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపారు.
also read : Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్…ఈ సమస్యలు ఉన్నవారు జాగ్రత్త…!
