క్రైమ్ మిర్రర్ : భారత్, చైనా సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు సమాచారం. అరుణాచల్ ప్రదేశ్‌లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (LAC) వద్ద జూలై 26న ఇరు దేశాల సైనికులు ఎదురుపడినట్లు తెలుస్తోంది. సాధారణ పెట్రోలింగ్ సమయంలో ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు సమాచారం. సరిహద్దులో చైనా సైనికులు ఇంగ్లీష్‌లో రాసిన బ్యానర్‌ను ప్రదర్శించడం వివాదానికి కారణమైనట్లు తెలుస్తోంది. అనంతరం ఇరు దేశాల సైనికుల మధ్య కొంతకాలం వాగ్వాదం, తోపులాట వంటి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగినట్లు సమాచారం. దాదాపు వారం రోజుల పాటు పరిస్థితి సున్నితంగా ఉన్నప్పటికీ, చివరకు ఇరు దేశాల ఉన్నత స్థాయి సైనిక అధికారులు జోక్యం చేసుకుని చర్చలు జరపడంతో పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం సరిహద్దులో పరిస్థితులు సాధారణంగానే ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ఘటనపై భారత ప్రభుత్వం లేదా భారత సైన్యం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. భారత్-చైనా సరిహద్దుల్లో ఇలాంటి ఘటనలు గతంలోనూ చోటుచేసుకున్నాయి. 2017లో డోక్లాం ప్రాంతంలో ఇరు దేశాల సైనికుల మధ్య తీవ్ర ప్రతిష్టంభన ఏర్పడింది. ఆ తర్వాత 2020లో లడఖ్‌లోని గల్వాన్ లోయ వద్ద జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. చైనా సైనికుల మరణాలపై ఆ దేశం అధికారికంగా తక్కువ సంఖ్యనే వెల్లడించింది.
ఇటీవలి కాలంలో అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా వైఖరి కూడా భారత్-చైనా సంబంధాల్లో ఉద్రిక్తతలకు కారణమవుతోంది. అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమంటూ చైనా వాదించడమే కాకుండా, అక్కడి పలు ప్రాంతాలకు కొత్త పేర్లు ప్రకటించే ప్రయత్నాలు చేసింది. ఈ చర్యలను భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ, అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగమని స్పష్టం చేస్తోంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఎల్‌ఏసీ వద్ద తాజా ఘటనపై అధికారిక వివరాలు వెలువడితేనే పూర్తి పరిస్థితి స్పష్టమయ్యే అవకాశం ఉంది.
also read : Irumudi: రవితేజను హీరో అనుకోలేదట… వెనుక అసలు కథ ఇదే…!
