సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌కు డమాస్కస్‌లోని క్రిమినల్ కోర్టు మరణశిక్ష విధించింది. 2011లో దేరా ప్రావిన్స్‌లో ఆయన ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న ఘటనలకు సంబంధించిన కేసులో కోర్టు ఈ తీర్పు వెలువరించింది.
కేసు విచారణలో భాగంగా దేరా ప్రాంతంలో జరిగిన హింసాత్మక ఘటనలను కోర్టు తీవ్రంగా పరిగణించింది. మానవత్వానికి వ్యతిరేకమైన నేరాలకు పాల్పడినట్లు పేర్కొంటూ.. ముందస్తు ప్రణాళికతో హత్యలకు పాల్పడ్డారనే అభియోగాలను కోర్టు నిర్ధారించింది. ఈ నేపథ్యంలో అసద్‌ను దోషిగా తేల్చి అత్యంత కఠినమైన శిక్ష విధించింది.
ఇదే కేసులో దక్షిణ సిరియాలోని దేరా ప్రాంతంలో గతంలో రాజకీయ భద్రతా విభాగానికి అధిపతిగా పనిచేసిన అతెఫ్ నజీబ్పైనా కోర్టు చర్యలు తీసుకుంది. ఆయనకు కూడా మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
అంతర్యుద్ధ కాలం నాటి నేరాలపై విచారణ
సిరియాలో 2011లో ప్రారంభమైన ఆందోళనలు ఆ తర్వాత తీవ్ర అంతర్యుద్ధానికి దారితీశాయి. ఈ కాలంలో జరిగిన హింస, హత్యలు, మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించి అనేక కేసులు నమోదయ్యాయి. తాజాగా దేరా ప్రాంతానికి సంబంధించిన కేసులో కోర్టు తీర్పు వెలువరించింది.
అసద్ పాలనలో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేరాలపై విచారణ జరగడం, మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష విధించడం సిరియా రాజకీయ, న్యాయ చరిత్రలో కీలక పరిణామంగా మారింది.
also read: దక్షిణాఫ్రికాలో ఘోర ప్రమాదం.. అక్రమ మైనింగ్ చేస్తూ 14 మంది మృతి
