Homeఅంతర్జాతీయంకెనడాలో భారతీయ యువతి హత్య.. ఏడు నెలల తర్వాత ప్రియుడి అరెస్ట్

కెనడాలో భారతీయ యువతి హత్య.. ఏడు నెలల తర్వాత ప్రియుడి అరెస్ట్

క్రైమ్ మిర్రర్ : కెనడాలో భారతీయ సంతతికి చెందిన యువతి హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. సుమారు ఏడు నెలల క్రితం హత్యకు గురైన హిమాన్షు ఖురానా (30) కేసులో ఆమెకు సన్నిహితుడిగా ఉన్న అబ్దుల్ గఫూరి (32)ని పోలీసులు అరెస్టు చేశారు. అతడిపై ఫస్ట్‌ డిగ్రీ మర్డర్‌ అభియోగాలు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. హిమాన్షు గత ఏడాది డిసెంబర్‌ 19న టొరంటోలో మృతిచెందారు. వెల్లింగ్టన్‌ స్ట్రీట్‌ వెస్ట్‌, స్ట్రాచన్‌ అవెన్యూ ప్రాంతంలో ఆమె మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా కేసును దర్యాప్తు చేశారు. మరుసటి రోజు పోలీసులకు సమాచారం అందడంతో అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ ఇది సహజ మరణం కాదని, హత్య జరిగిందని పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటన ఆ ఏడాది టొరంటోలో నమోదైన 40వ హత్యగా పోలీసులు పేర్కొన్నారు.

ప్రియుడిపైనే అనుమానం

విచారణలో హిమాన్షుకు అబ్దుల్ గఫూరితో కొంతకాలంగా సంబంధం ఉన్నట్లు పోలీసులకు సమాచారం లభించింది. ఇద్దరి మధ్య వ్యక్తిగత విభేదాలు ఉన్నట్లు కూడా దర్యాప్తులో తేలిందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో హిమాన్షు హత్యకు గఫూరినే బాధ్యుడిగా అనుమానించిన పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. అయితే హత్య అనంతరం గఫూరి కెనడా నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతడిపై దేశవ్యాప్తంగా అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసి, అతడి వివరాలను ప్రజలకు కూడా వెల్లడించారు. అతడి ఆచూకీ గురించి సమాచారం అందించాలని ప్రజలను కోరారు.

విదేశాల నుంచి కెనడాకు రప్పించి అరెస్ట్‌

నిందితుడు విదేశాల్లో ఉన్నట్లు గుర్తించిన కెనడా అధికారులు సంబంధిత అంతర్జాతీయ సంస్థల సహకారంతో అతడిని తిరిగి దేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. చివరకు అతడు టొరంటోకు చేరుకున్న సమయంలో విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అబ్దుల్ గఫూరిని ఏ దేశం నుంచి కెనడాకు తీసుకొచ్చారనే విషయాన్ని అధికారులు వెల్లడించలేదు. ప్రస్తుతం అతడిపై ఫస్ట్‌ డిగ్రీ మర్డర్‌ కేసు నమోదు చేసి తదుపరి న్యాయపరమైన చర్యలు చేపట్టారు. హిమాన్షు హత్యకు అసలు కారణం ఏమిటి? హత్యకు దారితీసిన పరిస్థితులు ఏంటి? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విచారణ పూర్తయిన తర్వాత కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
also read :ధార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు