జగిత్యాల జిల్లా,క్రైమ్ మిర్రర్:-జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో తీవ్ర కలకలం రేపిన సామూహిక లైంగిక దాడి ఉదంతానికి సంబంధించి పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించారు. నూకపల్లి డబుల్ బెడ్రూమ్ కాలనీలో ఓ మహిళను అదును చూసి వీడియో తీసి, దానిని అడ్డంపెట్టుకుని బ్లాక్మెయిల్ చేసి ఈ అఘాయిత్యానికి పాల్పడిన నలుగురు నిందితులను మల్యాల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఘటన వివరాలు:-
ఆగస్టు 3న జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి డబుల్ బెడ్రూమ్ కాలనీలో ఈ దారుణం చోటుచేసుకుంది. నిందితులు బాధితురాలిని రహస్యంగా వీడియో తీసి, ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడి సామూహిక లైంగిక దాడికి ఒడిగట్టారు. నిందితుల వేధింపులు భరించలేక బాధితురాలు ధైర్యంగా ముందుకు వచ్చి మల్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
నిందితుల వివరాలు:-
ఈ కేసులో మొత్తం నలుగురు నిందితులను పోలీసులు గుర్తించారు:
శివరాత్రి నరేశ్ (ఏ-1)
గుర్రం శ్రీకాంత్ (ఏ-2)
మారవేని మల్లేశ్ (ఏ-3)
గుర్రం అంజయ్య (ఏ-4)
నేరస్థుల నేపథ్యం:
ఈ ఘటనకు పాల్పడిన ప్రధాన నిందితుడు నరేశ్‌పై గతంలోనే 13 కేసులు ఉండగా, శ్రీకాంత్‌పై 9 కేసులు మరియు రౌడీషీట్లు ఉన్నాయి. మిగతా నిందితులపై కూడా గతంలో వివిధ నేరాలకు సంబంధించి కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల దర్యాప్తు మరియు స్వాధీనం:-
బాధితురాలి ఫిర్యాదు మేరకు వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, దర్యాప్తు వేగవంతం చేసి నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి నేరానికి ఉపయోగించిన ఇన్నోవా క్రిస్టా కారుతో పాటు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరపరిచి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ రాజ్ కుమార్ వెల్లడించారు.మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని, మహిళలను వేధించే వారిపట్ల, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపట్ల కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు ఈ సందర్భంగా గట్టిగా హెచ్చరించారు.
