భారతదేశంలో నకిలీ కరెన్సీ చలామణి కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటి వరకు అధిక విలువ కలిగిన నోట్లను లక్ష్యంగా చేసుకున్న నేర ముఠాలు, ఇప్పుడు తమ వ్యూహాన్ని మార్చి చిన్న విలువ కలిగిన నోట్లపై దృష్టి సారిస్తున్నాయి. రూ.10, రూ.20, రూ.50 వంటి నోట్లను పెద్దఎత్తున నకిలీగా ముద్రించి మార్కెట్లోకి ప్రవేశపెట్టే ప్రయత్నాలు పెరుగుతున్నట్లు భద్రతా సంస్థలు గుర్తించాయి.
ఇప్పటివరకు రూ.500 వంటి నోట్లపై ఎక్కువగా దృష్టి పెట్టిన ఈ ముఠాలు, చిన్న నోట్లను లక్ష్యంగా చేసుకోవడం వెనుక ముఖ్య కారణం ప్రజలు వాటిని ఎక్కువగా పరిశీలించకపోవడమేనని అధికారులు భావిస్తున్నారు. చిన్న నోట్ల వినియోగం ఎక్కువగా ఉండటంతో, వీటి ద్వారా పెద్ద మొత్తంలో నకిలీ కరెన్సీ చలామణి చేయడం సులభమవుతుందని అంచనా వేస్తున్నారు.
ఇటీవల వెలువడిన రిజర్వ్ బ్యాంక్ వార్షిక నివేదిక ప్రకారం, బ్యాంకింగ్ వ్యవస్థలో గుర్తించిన నకిలీ నోట్ల సంఖ్య పెరుగుదల దిశగా సాగుతోంది. ముఖ్యంగా రూ.20 నకిలీ నోట్ల గుర్తింపు గణనీయంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు, రూ.500 నకిలీ నోట్లు ఇంకా ఎక్కువగా పట్టుబడుతున్నాయి. అయితే రూ.50, రూ.100 నోట్లలో కొంత తగ్గుదల కనిపించినప్పటికీ, పరిస్థితి పూర్తిగా అదుపులోకి రాలేదని అధికారులు చెబుతున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర సంస్థలు అప్రమత్తమయ్యాయి. బ్యాంకుల్లో నగదు నిర్వహణ సిబ్బందికి నకిలీ నోట్లను గుర్తించే విధానాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న బ్యాంకు శాఖలకు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. నకిలీ నోట్లను గుర్తించడంలో నిర్లక్ష్యం వహిస్తే జరిమానాలు విధించే అవకాశముందని హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి.
ఇటీవలి కాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో చిన్న, పెద్ద విలువల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. స్థానిక స్థాయిలో పనిచేస్తున్న నెట్వర్క్ల ద్వారా ఈ నకిలీ నోట్ల తయారీ జరుగుతున్నట్లు దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. ఈ నెట్వర్క్లను గుర్తించి నిర్మూలించేందుకు నిఘా చర్యలు మరింత కట్టుదిట్టం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
చిన్న నోట్లపై దృష్టి పెట్టిన నకిలీ కరెన్సీ ముఠాల వ్యూహం దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త సవాలుగా మారుతోంది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి నోట్లను జాగ్రత్తగా పరిశీలించడం అవసరని అధికారులు సూచిస్తున్నారు.
also read: యూపీలో వర్షాల బీభత్సం.. పురాతన ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
