Homeజాతీయంరాష్ట్ర ప్రయోజనాల కోసం వ్యక్తిగత అవమానాలనైనా ఎదుర్కొంటా: సీఎం విజయ్

రాష్ట్ర ప్రయోజనాల కోసం వ్యక్తిగత అవమానాలనైనా ఎదుర్కొంటా: సీఎం విజయ్

క్రైమ్ మిర్రర్ : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రాష్ట్ర అసెంబ్లీలో కావేరి జలాల వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే వ్యక్తిగత అవమానాలను కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. కావేరి అంశాన్ని రాజకీయ లాభనష్టాల కోసం ఉపయోగించే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని చెప్పారు.

ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో కావేరి జలాల అంశంపై చర్చ సందర్భంగా ప్రతిపక్షం ప్రభుత్వాన్ని విమర్శించింది. కావేరి వివాదంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైందని, మరోవైపు మేకేదాటు డ్యామ్ నిర్మాణంలో కర్ణాటక ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందని ప్రతిపక్షం ఆరోపించింది. ఈ విమర్శలకు సమాధానంగా మాట్లాడిన సీఎం విజయ్, కావేరి నది తమిళనాడుకు జీవనాడి అని పేర్కొన్నారు. రాష్ట్ర జలహక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మేకేదాటు డ్యామ్ అంశంలో తమిళనాడు తన హక్కులను చట్టబద్ధంగా కాపాడుకుంటుందని తెలిపారు.

కావేరి సమస్య పరిష్కారం కోసం కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరపడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని విజయ్ వెల్లడించారు. అసెంబ్లీలో ఆమోదించిన తీర్మానాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పంపామని, అలాగే కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి కూడా లేఖ రాసినట్లు చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పును కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. 1969 నుంచి కర్ణాటకలో చేపడుతున్న డ్యామ్ ప్రాజెక్టులపై తమిళనాడు తన అభ్యంతరాలను వ్యక్తం చేస్తూనే ఉందని విజయ్ గుర్తు చేశారు. త్వరలో కర్ణాటక ముఖ్యమంత్రితో సమావేశమై ఈ అంశంపై చర్చించేందుకు బెంగళూరుకు వెళ్లనున్నట్లు తెలిపారు. “సమస్యలను పరిష్కరించుకోవాలంటే చర్చలే మార్గం. శత్రుదేశాలు కూడా చర్చలు జరుపుతాయి. అలాంటప్పుడు పొరుగు రాష్ట్రంతో మాట్లాడటంలో తప్పేమీ లేదు. తమిళనాడు ప్రజల ప్రయోజనాల కోసం అవసరమైతే ఎలాంటి అవమానాన్నైనా ఎదుర్కొనేందుకు నేను సిద్ధంగా ఉన్నాను” అని సీఎం విజయ్ పేర్కొన్నారు.
also read : రూపారెడ్డిపై అట్రాసిటీ, మోసం కేసులు.. 14 రోజుల రిమాండ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు