-
తెలుగు రాష్ట్రాలకు విస్తరించిన ఫోన్ ట్యాపింగ్ కేసు
-
ఆంధ్రప్రదేశ్లో సైతం బాధితులు
-
స్నేహితుడి కోసం అప్పటి గులాబీ పెద్దల సమాచార సహకారం
-
సిట్ దర్యాప్తులో సంచలనాలు
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో :- తెలంగాణలో ఫోన్ టాపింగ్ కేసు ప్రకంపనలు రేపింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ టాపింగ్ అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అంతే సీరియస్ గా దర్యాప్తు జరుగుతోంది. కానీ ఇప్పుడు ఆ కేసు దర్యాప్తు సరిహద్దుల దాటి ఏపీ వైపు విస్తరిస్తోంది. కేవలం తెలంగాణ పరిధిలోని రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలే కాకుండా.. ఏపీలో కీలక నేతలు, ఉన్నతాధికారుల ఫోన్లు కూడా టాపింగు కు గురయ్యాయని ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే ఇది ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రధానంగా గతంలో ఏపీలో పర్యవేక్షణ, అధికార మార్పిడి సమయంలో పురుగు రాష్ట్ర నిఘా వ్యవస్థలను వాడుకొని.. కొందరికి లబ్ధి చేకూర్చేలా ఈ నిఘా పర్వం కొనసాగిందనే అనుమానాలు బలపడుతున్నాయి.
-
ఏబీ వెంకటేశ్వరరావు వాంగ్మూలం..
తాజాగా ఏపీకి చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీవీ వెంకటేశ్వరరావును తెలంగాణ సిట్ విచారించింది. వాంగ్మూలాన్ని నమోదు చేసుకుంది. 2023 తో పాటు అంతకుముందు కూడా ఆయన కాల్ డేటా, సంభాషణలను అక్రమంగా సేకరించినట్టు సిట్ అధికారులు ఆధారాలు సేకరించారు. భారత రాష్ట్ర సమితి హయాంలోని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ పొరుగు రాష్ట్రానికి చెందిన ఒక ఐపీఎస్ అధికారిపై నిఘా పట్టడం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి? అప్పటి ఏపీ రాజకీయాల్లో వ్యూహాత్మక లబ్ధి కోసమే ఈ సమాచారాన్ని ఇతరులతో పంచుకున్నారా? అనే కోణాల్లో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగుతోంది.
-
జగన్ ప్రయోజనం..
అయితే తెలంగాణలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ టాపింగ్ చేయడం వెనుక జగన్ కు ప్రయోజనం ఉందన్న అనుమానాలు పెరుగుతున్నాయి. అప్పట్లో ఒక్క ఏబీవీతోనే ఆగలేదు. 2014లో ఏపీలో అధికారంలోకి వచ్చింది టిడిపి. తెలంగాణలో అధికారంలోకి వచ్చారు కెసిఆర్. టిడిపి ప్రభుత్వ కీలక నేతలు, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కోటరీకి అత్యంత సన్నిహితంగా ఉండే పోలీసు అధికారులు, వ్యాపారవేత్తల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. నాడు జగన్మోహన్ రెడ్డి ప్రయోజనాల కోసం లేదా ఆయనకు సమాచారం చేరవేసే క్రమంలో తెలంగాణలోని గత ప్రభుత్వ పెద్దలు ఇలా చేయించారనే ఆరోపణలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నేతల ఫోన్ నెంబర్లను మావోయిస్టుల పేరిట జాబితాలో చేర్చి.. డేటాను దొంగిలించిన తీరుపై దర్యాప్తు బృందాలు ఆధారాలు సేకరించాయి.
-
తుది నివేదికలో..
తెలంగాణ ప్రభుత్వం ఫోన్ టాపింగ్ పై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు సిట్ అధికారులు ఈ కేసులో అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసేందుకు కసరత్తు మమరం చేస్తున్నారు. తుది నివేదికలో ఏపీకి చెందిన ప్రముఖుల ఫోన్ల టాపింగ్ ఆధారాలు, దానికి సహకరించిన అధికారులు, ప్రయోజనం పొందిన రాజకీయ పెద్దల పేర్లు అధికారికంగా చేర్చే అవకాశం ఉందని తెలుస్తోంది. చట్ట విరుద్ధంగా టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ పక్క రాష్ట్ర ప్రజాప్రతినిధులు, అధికారుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించిన ఈ కుట్ర కోణాలు చార్జ్ సీట్ రూపంలో బయటకు వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించడం ఖాయం.
