ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఉన్న రాజర్షి దశరథ్ అటానమస్ స్టేట్ మెడికల్ కాలేజీలో ఒక సంచలన ఘటన చోటుచేసుకుంది. కాలేజీ ఎక్స్-రే విభాగంలో బాంబు తయారీకి సంబంధించిన వివరాలు ఉన్న ఒక హస్తప్రతి పత్రం బయటపడడంతో ఆ ప్రాంగణంలో తీవ్ర కలకలం రేగింది.
శనివారం ఉదయం విధుల్లో ఉన్న విభాగ ఇన్చార్జ్ ఆ పత్రాన్ని గుర్తించి వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఆ కాగితంలో పేలుడు పదార్థాల తయారీకి సంబంధించిన సూచనలు ఉండటంతో పాటు కొన్ని రసాయన పదార్థాల పేర్లు కూడా నమోదై ఉండటం గమనార్హం.
ఈ సమాచారం అందుకున్న చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అరవింద్ సింగ్ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పత్రాన్ని స్వాధీనం చేసుకుని ప్రాథమిక విచారణ ప్రారంభించారు.
విచారణలో భాగంగా, ఆ పత్రాన్ని మొదటి సంవత్సరం వైద్య విద్యార్థి సర్ఫరాజ్ రూపొందించినట్లు అనుమానం వ్యక్తమైంది. బలరాంపూర్‌కు చెందిన అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అలాగే ఆ సమయంలో విధుల్లో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులను కూడా విచారిస్తున్నారు.
ఈ ఘటన నేపథ్యంలో మెడికల్ కాలేజీ యాజమాన్యం అప్రమత్తమైంది. క్యాంపస్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని, ప్రతి విభాగంపై నిఘా పెంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
ఇటీవల దేశంలోని పలు ప్రాంతాల్లో జరిగిన పేలుడు ఘటనల నేపధ్యంలో ఈ సంఘటన ప్రాధాన్యత సంతరించుకుంది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
also read: వరుసగా అస్వస్థతకు గురైన విద్యార్థినులు.. దెయ్యం వదంతులతో భయాందోళనలు
