బీఆర్ఎస్ ముఖ్యనేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కాంగ్రెస్ నాయకులు బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్, అద్దంకి దయాకర్‌లపై న్యాయపోరాటానికి దిగారు. తనపై క్షుద్రపూజలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకుండా అసత్య ఆరోపణలు చేశారంటూ నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో పరువునష్టం పిటిషన్ దాఖలు చేశారు.
తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరుతూ హరీశ్‌రావు గతంలోనే ఇద్దరు కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు పంపించారు. ఇందుకోసం నిర్దిష్ట గడువును కూడా విధించారు. అయితే ఆ గడువు ముగిసినా వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో హరీశ్‌రావు తదుపరి న్యాయపరమైన చర్యలకు వెళ్లారు.
తన న్యాయవాది ద్వారా నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో పరువునష్టం పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తన వ్యక్తిత్వం, ప్రతిష్ఠ దెబ్బతినేలా నిరాధార వ్యాఖ్యలు చేశారని పిటిషన్లో పేర్కొన్నట్లు సమాచారం.
తన పరువుకు భంగం కలిగించినందుకు సంబంధిత నేతలపై చట్టప్రకారం క్రిమినల్, సివిల్ చర్యలు తీసుకోవాలని హరీశ్‌రావు కోర్టును కోరారు. ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
also read: రేవంత్ రెడ్డి భూముల అస్త్రం!
