క్రైమ్ మిర్రర్ : పశ్చిమ బెంగాల్‌లోని ఓ పాఠశాలలో ఒకే తరగతికి చెందిన పలువురు విద్యార్థినులు ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడంతో కలకలం రేగింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, కండరాల నొప్పులు, అసాధారణ శారీరక కదలికలు కనిపించడంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటన తర్వాత పాఠశాలకు సంబంధించిన పలు వదంతులు వ్యాపించి స్థానికంగా ఆందోళన నెలకొంది. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని సందేశ్‌ఖాలీ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ సహాయంతో నడిచే ఫుల్మోని ఆదర్శ విద్యామందిర్‌లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. తొమ్మిదో తరగతికి చెందిన సుమారు 30 మంది విద్యార్థినులు వరుసగా అస్వస్థతకు గురయ్యారు. మొదట వారిని సమీప ఆరోగ్య కేంద్రానికి తరలించగా, అనంతరం మెరుగైన చికిత్స కోసం మీనాఖా గ్రామీణ ఆసుపత్రికి పంపించారు.
ఘటనతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఇదే సమయంలో పాఠశాలలో “దెయ్యం” ఉందంటూ సామాజిక మాధ్యమాలు, స్థానికంగా పలు వదంతులు ప్రచారంలోకి వచ్చాయి. సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే సనత్ సర్దార్ పాఠశాలను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. కొందరు అస్వస్థతకు గురైన విద్యార్థినులను స్వయంగా తన వాహనంలో ఆసుపత్రికి తరలించారు. మరోవైపు జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు, డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ పాఠశాలను సందర్శించి ఘటనపై వివరాలు సేకరించారు. ప్రాథమిక చికిత్స అనంతరం చాలా మంది విద్యార్థినులు కోలుకున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన అసలు కారణాన్ని వైద్యపరంగా, శాస్త్రీయంగా పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకుండా దెయ్యం వంటి వదంతులను నమ్మవద్దని, వాటిని ప్రచారం చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
also read : ఓ యువకుడి మృతితో రణరంగమైన పోలీస్ స్టేషన్.. అసలు కారణమేంటి?
