క్రైమ్ మిర్రర్ : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘డ్రాగన్’ సినిమా షూటింగ్ సందర్భంగా ఆయనకు భుజానికి గాయం కావడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎన్టీఆర్ బృందం అధికారికంగా వెల్లడించింది.
సమాచారం ప్రకారం.. యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఎన్టీఆర్ భుజానికి గాయమైంది. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం చికిత్స అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు.
వైద్య పరీక్షల అనంతరం డాక్టర్ జె. మధుసూదన్ రావు, డాక్టర్ ఆర్.ఏ. పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలోని వైద్య బృందం ఎన్టీఆర్ పూర్తిగా కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు విశ్రాంతి అవసరమని సూచించినట్లు ఆయన టీమ్ తెలిపింది.
అలాగే, ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి ఎలాంటి అపోహలకు తావులేదని, కోలుకునే ప్రక్రియ సజావుగా సాగుతోందని స్పష్టం చేసింది. ఆయన ఆరోగ్యానికి సంబంధించిన అధికారిక సమాచారం ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటామని పేర్కొంది.
ఈ వార్త తెలియడంతో నందమూరి అభిమానులు, సినీ ప్రముఖులు ఎన్టీఆర్ త్వరగా కోలుకుని మళ్లీ షూటింగ్‌లో పాల్గొనాలని ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం ‘డ్రాగన్’ సినిమా షూటింగ్‌కు తాత్కాలిక విరామం ఇచ్చే అవకాశాలపై చిత్రబృందం సమీక్షిస్తున్నట్లు సమాచారం.
read also : గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట
